Share News

రైతులు కోల్పోయిన బోనస్‌ రూ.845కోట్లు

ABN , Publish Date - May 20 , 2025 | 02:20 AM

సన్నధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తామన్నా రైతులు పట్టించుకోలేదు. సన్నధాన్యం పండించడానికి పోటీపడ్డ రైతులు, విక్రయాల్లో మాత్రం ప్రభుత్వ సూచనలు పట్టించుకోకుండా, నేరుగా మిల్‌పాయింట్లు, వ్యాపారులకే విక్రయించారు.

రైతులు కోల్పోయిన బోనస్‌ రూ.845కోట్లు

మిల్లులకు సన్నధాన్యం విక్రయించడంతో ఈ పరిస్థితి

ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం 4శాతమే

బోనస్‌ కోల్పోతున్నా, ధర తక్కువ ఇచ్చినా పట్టించుకోని వైనం

తేమ, తాలు నిబంధనలే కారణమంటున్న రైతులు

నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్లకు గడువు

(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ) : సన్నధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తామన్నా రైతులు పట్టించుకోలేదు. సన్నధాన్యం పండించడానికి పోటీపడ్డ రైతులు, విక్రయాల్లో మాత్రం ప్రభుత్వ సూచనలు పట్టించుకోకుండా, నేరుగా మిల్‌పాయింట్లు, వ్యాపారులకే విక్రయించారు. దీంతో బోనస్‌ కోల్పోవడమేగాక, తక్కువ ధర వచ్చినా, రైతులు వ్యాపారులకు ధాన్యం విక్రయించేందుకు మొగ్గుచూపారు. ఫలితంగా ఉమ్మడి జిల్లా రైతులు రూ.845కోట్ల బోన్‌సను కోల్పోయారు.

యాసంగి సీజన్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 17.57లక్షల మెట్రిక్‌టన్నుల సన్నధాన్యం దిగుబడి రాగా, అందులో కేవలం 4 శాతం మాత్రమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. మిగిలిన ధాన్యం మొత్తం మిల్‌పాయింట్ల వద్ద వ్యాపారులే కొనుగోలుచేశారు. ధాన్యం ముమ్మరంగా వచ్చినప్పుడు, పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం వచ్చినప్పుడు కనీస మద్దతు కంటే ధర తగ్గించినా మిల్లుల వద్ద విక్రయానికే రైతులు మొగ్గుచూపారు. ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్‌లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు విక్రయించకపోవడంతో రైతులు సుమారు రూ.845కోట్ల బోన్‌సను కోల్పోయారు. కేంద్రాల వద్ద సన్నధాన్యం విక్రయించకపోవడానికి కారణాలను ప్రభుత్వం విశ్లేషించాల్సి ఉంటుందని, లేదంటే ప్రభుత్వం సన్నబియ్యాన్ని మిల్లర్ల వద్ద కొనుగోలు చేస్తే తప్ప వినియోగదారులకు పంపిణీచేయలేని పరిస్థితి ఎదుర్కోవల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

సన్నధాన్యం కొనుగోళ్లలో హవా చాటిన మిల్లర్లు

ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్‌లో దాదాపు 29.28లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనావేయగా, అందులో 17.57లక్షల మెట్రిక్‌టన్నుల సన్నధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని లెక్కలేశారు. అందులో కనీసం సగమైనా ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలుచేయాలని లక్ష్యంగా నిర్దేశించినా, క్షేత్రస్థాయిలో అందుకు తగినట్టు కొనుగోళ్లు లేవు. సన్నధాన్యం పండించిన రైతులు నేరుగా మిల్‌పాయింట్లకు, కల్లాల వద్ద వ్యాపారులకు విక్రయించేందుకే మొగ్గుచూపారు. ప్రధానంగా మిల్‌పాయింట్ల వద్ద ధాన్యం విక్రయిస్తే క్వింటాల్‌కు రూ.200 వరకు ధర తగ్గించినా, తేమ, ఇతర ప్రమాణాలను పట్టించుకోలేదని, కోతలు పూర్తయిన వెంటనే పచ్చిధాన్యాన్ని సైతం కొనుగోలు చేశారని, దీంతో తూకం కలిసొస్తుందనే కారణంతో రైతులు నేరుగా మిల్‌పాయింట్లకు, కల్లాల వద్ద వ్యాపారులకు విక్రయించారు. అదే ప్రభుత్వ కేంద్రాల వద్ద తేమశాతంతో పాటు, తాలు, మట్టిపెడ్డలు, తదితర కారణాలతో ఇబ్బందిపడాల్సి వచ్చిందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ కేంద్రాల వద్ద విక్రయిస్తే ధాన్యం ఆరబెట్టి, మళ్లీ తూర్పారపడితే తప్ప కొనుగోళ్లు జరగడం లేదు. దీంతో క్వింటాకు కనీసం 10కిలోల వరకు తూకంలో తేడావస్తుందని, పైగా 15రోజులకు పైగా కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తుందని, మిల్లుల వద్ద, కల్లాల వద్ద విక్రయిస్తే ఈ బాధ ఉండదనేది రైతుల వాదన. పచ్చిధాన్యం కొనుగోలుచేస్తున్నారని రైతులు క్వింటాకు రూ.500 బోనస్‌ సైతం కోల్పోయారు. ఉమ్మడి జిల్లాలో సన్నధాన్యం కొనుగోళ్లలో కనీస లక్ష్యాన్ని సైతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు చేరుకోలేకపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో ఇప్పటివరకు కేవలం 4శాతం మేర అంటే సుమారు 68,971 మెట్రిక్‌టన్నుల సన్నధాన్యం మాత్రమే ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు చేయగా, మిల్‌పాయింట్ల వద్ద సుమారు 14లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం ఇప్పటివరకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. నెలాఖరు వరకు ధాన్యాన్ని కొనుగోలుచేసేందుకు ప్రభుత్వం అనుమతించినా, సన్నధాన్యం ఇప్పటికే కేంద్రాలకు రావడం దాదాపు నిలిచింది.

నెలాఖరు వరకు కొనుగోళ్లు...

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో 1,053 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 29.19లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వరి భారీగా సాగుకావడం, దిగుబడి సైతం భారీగా రావడంతో నల్లగొండ, యాదాద్రి జిల్లాల్లో గతవారం వరకు కేంద్రాల వద్ద ఎటుచూసినా ఽధాన్యం రాశులే కనిపించాయి. కాంటాల కోసం రైతులు, కేంద్రాల నిర్వాహకులు అవస్థలుపడాల్సిన పరిస్థితి కొనసాగింది. కలెక్టర్లు సైతం నేరుగా రంగంలోకి దిగి కాంటాలు, రవాణాపై ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడంతో ఈ రెండు జిల్లాల్లో పరిస్థితి కుదుటపడగా, సూర్యాపేట జిల్లాలో ఇంకా కేంద్రాల వద్ద ఒత్తిడి కొనసాగుతూనే ఉంది. కాంటాలు వేస్తున్నప్పటికీ ఆ జిల్లాలో మిల్లులు తక్కువగా ఉండడం, నల్లగొండ జిల్లాలోని మిల్లులకు ధాన్యం కేటాయించడంతో రవాణాలో జాప్యం జరుగుతుండడంతో ఈ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో ఒత్తిడి యథావిధిగా కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ మూడు జిల్లాల్లో కలిపి 10.80మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా కేంద్రాల వద్ద, రైతుల కల్లాల వద్ద ధాన్యం భారీగానే ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నెలాఖరువరకు కేంద్రాలను కొనసాగించాల్సి ఉంటుందనే అంచనాకు వచ్చిన అధికార యంత్రాంగం ఆయా గ్రామాల్లో పరిస్థితికి అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను మూసివేస్తూ, ధాన్యం వస్తున్న కేంద్రాలను కొనసాగిస్తున్నారు. నెలాఖరు వరకు ఇలాగే వచ్చిన ధాన్యం వచ్చినట్టు కొనుగోలు చేయాలని అధికారులు నిర్ణయించారు.

చెల్లించాల్సిన బోనస్‌ పెండింగ్‌

ఉమ్మడి జిల్లాలో ఈ సీజన్‌లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి సంబంధించి బోనస్‌ ఇంకా రైతు ల ఖాతాల్లో జమకాలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 68,971 మెట్రిక్‌టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేయగా, అందుకుగాను రూ.34.48కోట్ల విలువైన బోనస్‌ రైతులకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే రైతుల ఖాతాల వివరాలు సేకరించిన పౌరసరఫరాలశాఖ ఆన్‌లైన్‌లో వాటి నమోదును కూడా పూర్తిచేసింది. తొలుత ధాన్యం బిల్లులు క్లియర్‌ చేస్తుండడంతో అవి కొలిక్కి వచ్చాక బోనస్‌ ను ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ వారాంతంలోగా బోనస్‌ మొత్తం రైతుల ఖాతాల్లో నేరుగా జమవుతుందని వారు పేర్కొంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ కేంద్రాల్లో సన్నధాన్యం కొనుగోళ్లు ఇలా..

జిల్లా సన్నధాన్యం కొనుగోలు చేసిన బోనస్‌ చెల్లింపులు

దిగుబడి సన్నధాన్యం (రూ.కోట్లలో)

(మెట్రిక్‌టన్నులు)

నల్లగొండ 8,67,000 19,230 9.61 -

సూర్యాపేట 8,40,000 49,146 24.57 -

యాదాద్రి 50,000 595 0.29 -

మొత్తం 17,57,000 68,971 34,48 -

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ కేంద్రాల్లో మొత్తం ధాన్యం కొనుగోళ్లు ఇలా..

జిల్లా కొనుగోలు చేసిన ధాన్యం

(మెట్రిక్‌టన్నులు)

నల్లగొండ 5,42,224

సూర్యాపేట 2,70,564

యాదాద్రి 2,66,520

మొత్తం 10,79,380

Updated Date - May 20 , 2025 | 02:20 AM