స్థానికంపై బీజేపీ గురి
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:09 AM
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రిజర్వేషన్లు, తదితర అంశాలపై చర్చించిన మంత్రివర్గం, ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధిష్ఠానం
పల్లె, పట్టణం బాట పట్టాలని నేతలకు సూచన
కేంద్ర ప్రభుత్వ పథకాలతో జనంలోకి
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రిజర్వేషన్లు, తదితర అంశాలపై చర్చించిన మంత్రివర్గం, ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటి రానున్న రోజుల్లో మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అందగానే ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని అధిష్ఠానం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోం ది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టుకోసం తిప్పలు పడుతోంది. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోగా రాష్ట్రంలో పార్టీని పటి ష్టం చేసేందుకు అడుగులు వేస్తోంది. పార్టీ బలోపేతం కావాలం టే ప్రధానంగా క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలను తయారు చేసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ స్థానిక సంస్థలైన గ్రా మపంచాయతీ, మండల, జిల్లా పరిషత్, మునిసిపాలిటీల్లో పాగా వేసేందుకు అడుగులు వేస్తోంది. అందులో భాగంగా కేంద్ర ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూ వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నాయకత్వం జిల్లా స్థాయి నేతలకు సూచించింది. జిల్లాల వారీగా కేంద్ర, రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా ఇన్‌చార్జీలను కూడా నియమించింది. ఈ నేతలం తా నిత్యం స్థానిక నేతలను సమన్వ యం చేసుకుంటూ పార్టీ అభ్యర్థుల ఎంపికతో పాటు అన్ని వ్యవహారాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే జిల్లా కార్యవర్గాలతో బీజేపీ ఇన్‌చార్జీలు సమావేశాలు నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలోని పదాధికారులం తా పల్లె, పట్టణం బాటపట్టాలని పార్టీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. ఉమ్మడి జిల్లాల్లో రానున్న ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకొని బలమున్న చోట పార్టీని మరింత పటిష్టం చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తోంది.
కేంద్రం పథకాలతో క్షేత్రస్థాయికి
కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద నిధులు విడుదల చేస్తోంది. వీటిపై క్షేత్రస్థాయిలో బీజేపీ విస్తృత ప్రచారం నిర్వహించనుంది. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని బీజేపీ నేతలు కేంద్రం నుంచి రాష్ట్రానికి పలు పథకాలకు విడుదలైన నిధుల సమాచారాన్ని జిల్లా అధికారుల నుంచి సేకరిస్తున్నారు. రాష్ట్రం, జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎయిమ్స్ బోర్డు సభ్యురాలిగా ఉన్న మహమూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఇటీవల యాదాద్రి జిల్లాలోని ఎయిమ్స్‌ను సందర్శించారు. ఎయిమ్స్‌లో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తోందనే ప్రచారం కల్పించేందు కు ఆమె ఎయిమ్స్‌ను సందర్శించిరు. అదేవిధంగా కేంద్ర ప్రభు త్వం ప్రధానంగా ఉపాధి హామీ పథకం, ఆయుష్మాన్‌భవ, తదితర పథకాల కింద నిధులు విడుదల చేస్తోంది. ఏ పథకం కింద ఎంత మేరకు నిధులు మంజూరు చేసిందనే అంశాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ యత్నిస్తోంది. ఉపాఽధి హామీ పథకం కింద యాదాద్రి జిల్లాకు 63 నిర్మాణ పనులకు రూ.8.47కోట్లు, 10 గ్రామపంచాయతీల భవనాల నిర్మాణాలకు రూ.2కోట్లు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం కోసం రూ.3.12కోట్లు, 27స్కూళ్ల ప్రహరీగోడ నిర్మాణానికి కేంద్రం రూ.3.35కోట్లు విడుదల చేసింది. వీటిపై స్థానిక బీజేపీ నేతలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రచారాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నిధులు మంజూరుచేసిన ప్రధానికి కృతజ్ఞతలు : డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, బీజేపీ నేత, మాజీ ఎంపీ
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల కింద నిధులు విడుదల చేస్తోంది. యాదాద్రి జిల్లాకు కేంద్రప్రభుత్వం ఇటీవల రూ.8.47 కోట్లు విడుదల చేసింది. ఉపాధితో హామీతో పాటు కార్యక్రమాలకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్ అనే నినాదంతో కేంద్రం అభివృద్ధికి బాటలు వేస్తోంది. నిధులు మంజూరుచేసిన ప్రధానమంత్రికి బీజేపీ, జిల్లా ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
స్థానిక ఎన్నికల్లో పట్టుసాధిస్తాం : ఉట్కూరి అశోక్‌గౌడ్, యాదాద్రిభువనగిరి బీజేపీ జిల్లా అధ్యక్షుడు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పట్టు సాఽధిస్తుంది. పట్టణాల్లో పార్టీ బలంగా ఉంది. పల్లెల్లోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని పార్టీలతో సమ ఉజ్జిగా పోరాడుతుంది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని నిర్వహిస్తాం.