అశ్రునయనాల మధ్య భూపాల్‌రెడ్డి అంత్యక్రియలు
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:11 AM
చౌటుప్పల్ మాజీ సర్పంచ, సీపీఎం ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకుడు చింతల భూపాల్‌రెడ్డి పార్థివ దేహానికి బుధవారం అశ్రునయనాల మద్య బుధవారం అంత్యక్రియలను నిర్వహించారు.
చౌటుప్పల్ టౌన, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): చౌటుప్పల్ మాజీ సర్పంచ, సీపీఎం ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకుడు చింతల భూపాల్‌రెడ్డి పార్థివ దేహానికి బుధవారం అశ్రునయనాల మద్య బుధవారం అంత్యక్రియలను నిర్వహించారు. పట్టణంలోని విద్యానగర్ కాలనీలో గల తన ఇంటి నుంచి ప్రత్యేక వాహనంతో ప్రారంభమైన భూపాల్ రెడ్డి అంతిమ యాత్ర జాతీయ రహదారిపై తిరిగి సీపీఎం కార్యాలయం వద్దకు చేరుకుంది. అక్కడ భూపాల్ రెడ్డి పార్థివ దేహాన్ని కొద్ది సేపు ప్రజల సందర్శనార్థం ఉంచగా, ఆ ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నివాళులర్పించారు. ప్రజా నాట్యమండలి కళాకారుల విప్లవ గీతాల నడుమ అంతిమయాత్ర సాగింది. కడసారి చూపు కోసం చుట్టపక్క మండలాలతో పాటు ఉమ్మడి నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాలనుంచి ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఎర్ర జెండా కోసం నిబద్ధతతో నిలబడిన యోధుడు చింతల భూపాల్‌రెడ్డి అని కొనియాడారు. పార్టీ విధానాల పట్ల నిబద్ధత, ఉద్యమాల నిర్వహణ లో పట్టుదల గల భూపాల్‌రెడ్డి భవిష్యత తరాలకు ఆదర్శప్రాయుడని ఆయన అన్నారు. అంతిమ యాత్రలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బూరుగు కృష్ణారెడ్డి, మండల, పట్టణ కార్యదర్శులు గంగదేవి సైదులు, గోశిక కరుణాకర్, దండ అరుణ్‌కుమార్, కాంగ్రెస్ మునుగోడు అసెంబ్లీ ఇంచార్జ్ పబ్బు రాజు గౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన చెన్నగోని అంజయ్య, మాజీ వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు సుర్వి నర్సింహ, బోయ దేవేందర్, బొడిగె బాలకృష్ణ, బత్తుల విప్లవ్ పాల్గొన్నారు.