భూభారతి దరఖాస్తులు 844 పరిష్కారం
ABN , Publish Date - Jul 28 , 2025 | 12:26 AM
భూభారతిలో భాగంగా జిల్లాలో ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 15,046 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 1,785 దరఖాస్తులు పరిష్కారానికి అర్హమైనవిగా అధికారులు గుర్తించగా, తిరస్కరణకు గురైన వాటికి నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మొత్తం దరఖాస్తులు 15,046
ఇప్పటివరకు 1,785 దరఖాస్తులకు అంగీకారం
తిరస్కరణకు గురైన వాటికి నోటీసులు జారీ
ఏళ్ల తరబడి పెండింగ్‌లోని సమస్యలకు పరిష్కారం లభించేనా?
(ఆంధ్రజ్యోతి,యాదాద్రి): భూభారతిలో భాగంగా జిల్లాలో ఇటీవల నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 15,046 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 1,785 దరఖాస్తులు పరిష్కారానికి అర్హమైనవిగా అధికారులు గుర్తించగా, తిరస్కరణకు గురైన వాటికి నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, మొత్తం దరఖాస్తులో ఇప్పటి వరకు 844 పరిష్కారానికి నోచుకున్నాయి.
ధరణితో రైతులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్వోఆర్ చట్టం 2020ను తిరగరాసి భూభారతిని తీ సుకొచ్చింది. తొలుత రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని మండలాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేసి, ఆ తరువాత అన్ని జిల్లాల్లో భూభారతిని అమలుచేసింది. జిల్లాలో 17మండలాల్లో ఈ చట్టం అమలులోకి రాగా, ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. జిల్లాలో మొత్తం 15,046 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తు లకు సంబంధించి ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తికాగా,వీటిని ఆగస్టు 15లోగా పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మే రకు జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులపై రెవె న్యూ అధికారులు వారం రోజులుగా కలెక్టరేట్‌లో కుస్తీపడుతున్నారు. జిల్లారెవెన్యూ యంత్రాంగం భూభారతి చట్టం మేరకు వారి పరిధిలో ఉన్న దరఖాస్తులను పరిష్కరించి, మిగతా వాటికి ఎండార్స్‌మెంట్ (సమాధాన నోటీసు) ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించారు.
844దరఖాస్తుల పరిష్కారం
జిల్లాలోని 17 మండలాల్లో 301 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన రెవె న్యూ సదస్సుల్లో మొత్తం 15,046 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇప్పటివరకు 844 దరఖాస్తులను పరిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా 1,785 దరఖాస్తులు పరిష్కారానికి అర్హమైనవిగా అధికారులు గుర్తించారు. భువనగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 11,769 దరఖాస్తులు రాగా, 1,430 అర్హమైనవిగా గుర్తించారు. 647 దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. చౌటుప్ప ల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 3,277 దరఖాస్తులు రాగా, 197 పరిష్కరించారు. 355 దరఖాస్తులు పరిష్కారానికి అర్హమైనవిగా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా పట్టాదా రు భూములు అసైన్డ్‌గా, లావుడ్యా, ప్రభుత్వ భూములుగా నమోదు కావడం, సరిహద్దుల్లోని భూవివాదాలు, పేరు మార్పిడి వంటి వాటికి వెంటనే పరిష్కారం చూపిస్తున్నారు. ప్రధానం గా రైతుల భూములు వేరే వారి ఖాతాల్లో వెళ్లడం, పేరు తప్పుగా పడటం, సర్వేనెంబర్లు మార్పులు కావడంతో పాటు, భూమి ఉండి కూడా లేని వారిగా మారిపోయారు. కోర్టు కేసులు ఉన్న భూములు కాకుండా జిల్లా రెవెన్యూశాఖ పరిధిలోని దరఖాస్తులన్నీ పరిష్కారానికి నోచుకునేనా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మ్యుటేషన్‌లు, పేర్లు మార్పిడి, పట్టాదారు పాస్‌పుస్తకాలు, తదితర వాటికి ప్రాధాన్యం ఇస్తూ కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ పరిధిలో ఉన్న పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. పలు మండలాల్లో భూ సమస్యలు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు పరిష్కారం కావడంలేదు? ఏళ్ల తరబడిగా ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి? ఏ అధికారి వద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుందనే పూర్తి సమాచారాన్ని సేకరించారు. అయితే ప్రభుత్వం భూ భారతిలో అవకాశం కల్పిస్తే తప్ప జిల్లా యంత్రాంగం ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సమస్యలన్నీ ఎప్పటిలోగా పరిష్కారం అవుతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు.
నోటీసుల పంపిణీ షురూ
భూభారతి చట్టం అమలులో భాగంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో అధిక శాతం సర్వే నెంబర్లు, పేర్ల మిస్సింగ్‌లతో పాటు సాదాబైనామా దరఖాస్తులు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులకు మూడు నోటీసులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకటి రైతుకు, మరొకటి పంచాయతీ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో అంటించనున్నారు. నోటీసులో పేర్కొన్న అంశాలకు సంబంధించిన అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచిస్తున్నారు. ముందుగా మిస్సింగ్ నెంబర్లు, పేర్లు, పెండింగ్ మ్యుటేషన్, సర్వేనెంబర్లలో, పేర్లలో తప్పుల సవరణలతో పాటు చిన్న సమస్యల పరిష్కారానికి తగిన కార్యచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. గ్రామాల వారీగా నోటీసులు అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. జిల్లాలో సాదాబైనామా దరఖాస్తులు 3,458 వచ్చాయి. వాటి పరిష్కారంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వేచిచూస్తున్నారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతీ దరఖాస్తుకు నోటీసు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జి.వీరారెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
సమస్యలు పరిష్కారానికి నోచుకునేనా?
జిల్లాలో సర్వేనెంబర్లలో మార్పులు, చేర్పు లు, పీపీబీ, ఆర్వోఆర్, నాలా, ఆర్‌ఎ్‌సఆర్ సవరణ, అప్పీల్స్, కోర్టు కేసులు, పొడు భూములు, తదితర 30 రకాల భూసమస్యలపై దరఖాస్తు లు వచ్చాయి. అయితే వీటిన్నింటి పరిష్కారం ఎప్పుడనేది ప్రశ్నార్థకంగా మారింది. చాలా మండలాల్లో భూమి ఒకచోట, కబ్జా మరోచోట ఉంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే రెవె న్యూ యంత్రాంగం తొలుత అనుభవదారు వివరాలను (కాలాన్ని) పునరుద్ధరించాలి. అయితే భూభారతిలో అనుభవదారు సమాచారం నమోదుచేసే కాలం లేదు. దీంతో పాటు సర్వే నెంబర్లు, భూముల విస్తీర్ణం, పట్టాదారుల పేర్లు మార్పులు, చేర్పులు చేపట్టాల్సి ఉంది. జిల్లా రెవెన్యూ యంత్రాంగం వీటి జోలికి మాత్రం వెళ్లడం లేదు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుదారులకు నోటీసులు జారీచేస్తుండగా, వచ్చిన దరఖాస్తులు ఎందుకు తిరస్కరణకు గురయ్యాయో లిఖిత పూర్వకంగా తెలియజేయనున్నారు.