Share News

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:06 AM

:రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

భారీ వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి

భువనగిరి(కలెక్టరేట్‌),ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా వర్షపాతం నమోదైందన్నారు. వర్షాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు వచ్చే రోజుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో సహాయక చర్యల నిమిత్తం ఉమ్మడి 10 జిల్లాలకు సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. సెలవులో ఉన్న అధికారుల సెలవులు రద్దు చేసి వెనక్కి రప్పించాలన్నారు. లోతట్టు, వరద ముంపు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. రైల్వే లైన్లు, లోలెవల్‌ బ్రిడ్జీలు కాజ్‌వేలు, కల్వర్టుల వద్ద వర్షం నీరు సాఫీగా వెళ్లేలా చూడటంతోపాటు, బ్రిడ్జీల పైనుంచి నీటి ప్రవాహం వెళ్లే చోట పోలీసు సిబ్బందిని నియమించాలన్నారు. అంటువ్యాదులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకొని తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ హనుమంతరావు, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు, డీసీపీ అక్షాంశ్‌యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి

వర్షాల నేపథ్యంలో ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్‌ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాలతో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలన్నారు. పోలీసు, రెవెన్యూ ఇరిగేషన్‌ శాఖల సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలన్నారు. వాగులు, వంకలు, వరదల వద్దకు ప్రజలు వెళ్లకుండా చూడాలని, మూసీ పరివాహక ప్రాంతాల నీటి ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

మెరుగైన వైద్యం అందించాలి

(ఆంధ్రజ్యోతి, యాదగిరిగుట్ట రూరల్‌): అనారోగ్య సమస్యలతో పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. గురువారం యాదగిరిగుట్ట మండల కేంద్రంలోని పీహెచ్‌సీని ఆయన తనిఖీచేశారు. హాజరు, ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు. ఎంత ఓపీ ఉంటోందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. గత నెల ఆస్పత్రిలో జరిగిన సాధారణ ప్రసవాలు ఎన్నో వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవం చేయించుకున్న మహిళ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

ఇందిరమ్మ ఇళ్లను పూర్తిచేయాలి

(ఆంధ్రజ్యోతి, తుర్కపల్లి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేయాలని కలెక్టర్‌ హనుమంతరావు అన్నారు. గురువారం తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీవో లెంకల గీతారెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ సంతోష్‌, పంచాయతీ కార్యదర్శి మహేందర్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 01:06 AM