యూరియా కోసం బారులు
ABN , Publish Date - Jul 18 , 2025 | 12:41 AM
హుజూర్‌నగర్ మండలంలో యూరియా కొరత రైతులను నిరాశకు గురిచేస్తోంది. బూరుగడ్డ సహకార పరపతి సంఘం ఎదుట గురువారం యూరియా కోసం రైతులు తరలివచ్చారు.
తెల్లవారుజామునే బూరుగడ్డకు చేరుకున్నరైతులు
హుజూర్‌నగర్, జూలై 17 (ఆంధ్రజ్యోతి): హుజూర్‌నగర్ మండలంలో యూరియా కొరత రైతులను నిరాశకు గురిచేస్తోంది. బూరుగడ్డ సహకార పరపతి సంఘం ఎదుట గురువారం యూరియా కోసం రైతులు తరలివచ్చారు. బుధవారం సంఘానికి 444బస్తాల యూరియా రాగా గురువారం తెల్లవారుజాము నుండే యూరియా కోసం రైతులు బారులుతీరారు. బస్తా రూ.266లకు విక్రయించారు. బూరుగడ్డ రెవెన్యూ క్లష్టర్ పరిధిలో సుమారు 5వేల ఎకరాలు ఉండగా ఎకరానికి 2 బస్తాల చొప్పున యూరియా అవసరం కాగా కనీసం బస్తా కూడా సరఫరా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పీఏసీఎస్ పరిధిలో రైతులు యూరియా కోసం తీవ్రఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిలబడితే కొందరికే యూరియా దక్కిందన్నారు. అందని రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఇదిలాఉండగా హుజూర్‌నగర్ డివిజన్‌లో సుమారు 260 ఎరువుల దుకాణాలు ఉండగా రూ.400ల నుంచి 500ల వరకు యూరియా బస్తా విక్రయిస్తున్నారు. దీంతో రైతులు సహకార సంఘాల వైపే మొగ్గు చూపుతున్నారు. హుజూర్‌నగర్ మండలంలో వేపలసింగారం, అమవరం, లింగగిరి, హుజూర్‌నగర్, బూరుగడ్డ ప్రాంతాలలో నాలుగు చోట్ల సహకార సంఘాలు ఉండగా వాటిల్లో మాత్రమే తక్కువ ధరకు యూరియా అందిస్తున్నారన్నారు. ఈ క్రమంలో అక్కడ అందకపోవడంపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరి యా అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు ఇస్తున్నప్పటికీ ఆచరణలో అమలుకావడం లేదు. వారానికి ఒకసారి మాత్రమే సహకార సంఘాలకు లారీ లోడు వస్తుందని అధికారులు తెఎలిపారు.