Share News

ఎస్సీ, ఎస్టీలపై దాడులను నివారించాలి

ABN , Publish Date - Mar 12 , 2025 | 12:26 AM

షెడ్యూల్డ్‌ కులాలు, తెగలపై దాడులు నివారించాలని, అంటరానితనాన్ని అరికట్టేందుకు ప్రతీ నెల చివరి వారంలో పౌరహక్కుల దినోత్సవాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రతీ మూడు నెలలకోసారి జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య ఆదేశించారు.

ఎస్సీ, ఎస్టీలపై దాడులను నివారించాలి

ప్రతీ నెల పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలి

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య

నల్లగొండ, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డ్‌ కులాలు, తెగలపై దాడులు నివారించాలని, అంటరానితనాన్ని అరికట్టేందుకు ప్రతీ నెల చివరి వారంలో పౌరహక్కుల దినోత్సవాన్ని తప్పనిసరిగా నిర్వహించాలని, ప్రతీ మూడు నెలలకోసారి జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల భూములకు సంబంధించి తొమ్మిది కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటిపై ఈ నెల 31లోగా నివేదిక అందజేయాలని కలెక్టర్‌ ఇలా త్రిపాఠిని ఆదేశించారు. అలాగే ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించి 17 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటి నివేదికలు పంపించాలని ఎస్పీని ఆదేశించగా, ఎస్పీ శరత్‌చంద్ర పవర్‌ మాట్లాడుతూ, 12 కేసులకు ఇదివరకు నివేదికలు పంపించామని, ఐదు కేసులకు సంబంధించి నివేదికలు పెండింగ్‌లో ఉన్నాయని, కమిషన్‌ ఆదేశాల మేరకు నిర్దేశించిన సమయంలో నివేదికలు పంపిస్తామన్నారు. 37 కేసుల్లో చార్జిషీట్‌ ఇంకా దాఖలు చేయలేదని, సకాలంలో దాఖలు చేయకపోతే లబ్ధిదారులు నష్టపోవాల్సి వస్తుందని, వెంటనే చార్జిషీట్‌ దాఖలు చేయాలని చైర్మన్‌ ఆదేశించారు. పరిహారం ఇచ్చే విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో దేవాలయ ప్రవేశం, అంటరానితనం, ఎస్సీ, ఎస్టీలపై దాడుల నివారణకు ప్రతీ నెల చివర పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. అందుకు ఎస్‌ఐలు, తహసీల్దార్లు సంవత్సరానికి సంబంధించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. అలాగే జిల్లాస్థాయి విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశాలు నిర్వహించాలని, దీనికి సంబంధించిన సమాచారం వారం రోజుల ముందే కమిషన్‌ దృష్టికి తీసుకువస్తే తానుగానీ, ఇతర సభ్యులుగానీ హాజరవుతారని తెలిపారు. ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల ఏర్పాటులో ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించాలని, సబ్‌ ప్లాన్‌ అమలు విషయంలో ఎవరైనా లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీ నిధులు, సీడీపీ తదితర అన్ని నిధుల్లో వాటా తప్పనిసరిగా అందేలా చూడాలన్నారు. ఉపాధి హామీ నిధులు కూడా ఎస్సీ, ఎస్టీలకు వినియోగించాలని, ఈ నెల 31లోగా ఉపాధి హామీ పనులకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలన్నారు. పదోన్నతుల విషయంలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కమిషన్‌ సభ్యులు కుస్రం నీలాదేవి, రాంబాబు నాయక్‌, కొంకతి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్‌, జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి సంక్షేమ ఇన్‌చార్జి అధికారి, పరిశ్రమలశాఖ మేనేజర్‌ కోటేశ్వరరావు, గిరిజన సంక్షేమాధికారి, గృహ నిర్మాణశాఖ పీడీ రాజ్‌కుమార్‌, ఇన్‌చార్జి డీఆర్‌వో అశోక్‌రెడ్డి, మిర్యాలగూడ సబ్‌ కలెక్టర్‌ నారాయణ్‌ అమిత్‌, దేవరకొండ ఏఎస్పీ మౌనిక, ఎస్సీ, ఎస్టీ కోర్టు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అఖిల తదితరులు పాల్గొన్నారు. ప్రణయ్‌ హత్య కేసులో వాదనలను వినిపించి నిందితులకు శిక్షపడేలా చేసిన న్యాయమూర్తి దర్శనం నర్సింహను ఈ సందర్భంగా చైర్మన్‌, సభ్యులు సన్మానించారు.

Updated Date - Mar 12 , 2025 | 12:26 AM