Share News

పంచాయతీలకు పక్కా భవనాలేవీ?

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:30 AM

మోటకొండూరు మండలంలో నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు.

పంచాయతీలకు పక్కా భవనాలేవీ?
ముత్తిరెడ్డిగూడెంలో శిథిలవాస్థకు చేరిన జీపీ భవనం

మోటకొండూరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): మోటకొండూరు మండలంలో నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు. దీంతో పలు గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాలు అద్దె భవనాల్లో, ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటిహాళ్లలో కొనసాగుతున్నాయి. మండలంలోని ఆరెగూడెం, గిరబోయినగూడెం, సికిందర్‌నగర్‌, ముత్తిరెడ్డిగూడెం, కదిరేనిగూడెం గ్రామ పంచాయతీ భవనాల కోసం గత ప్రభుత్వం 2023లో ఒక్కో భవనానికి ఎంజీఎనఆర్‌ఈజీఎ్‌స ద్వారా రూ.20లక్షల చొప్పున నిధులు మంజూరి చేసింది. ఎన్నికల ముందు హడావిడిగా శంకుస్థాపనలు కూడా చేశారు. కానీ ఇప్పటికీ పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు, ప్రజాప్రతినిధులు ఇబ్బందులుపడున్నారు. ఆరెగూడెంలో జీపీ కార్యాలయం లేకపోవడంతో అంగనవాడీ భవనంలో విధులు నిర్వహిస్తున్నారు. గిరబోయినగూడెం జీపీ కార్యాలయం పాలకేంద్రంలో, సికిందర్‌నగర్‌ జీపీ కార్యాలయం ప్రైవేట్‌ పాఠశాలలో, ముత్తిరెడ్డిగూడెం జీపీ కార్యాలయం పాత ప్రాథమిక పాఠశాలలో, కదిరేనిగూడెం జీపీ కార్యాలయం ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇటీవల నూతనంగా ఏర్పడిన పెద్దబావి, అబీద్‌నగర్‌ జీపీ కార్యాలయాలు ప్రాథమిక పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. ఇలా అన్ని నూతన గ్రామపంచాయతీలు ముతబడిన ప్రాథమిక పాఠశాల, అంగనవాడి ఇ తర భవనాల్లో కొనసాగుతున్నా అదికారులు, రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడం పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అధికారులు, పాలకులు స్పందించి జీపీ పనులను వెంటనే ప్రారంభించి, జీపీ భవనాలను అందుబాటులోకి తీపుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

శిథిలవస్థలో జీపీ కార్యాలయం

నూతనంగా ఏర్పడిన ముత్తిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం శిథలవాస్థకు చేరింది. 40 ఏళ్ల క్రితం ప్రాథమిక పాఠశాల కోసం ఈ భవానాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఇందులో జీపీ కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. భవనం శిథిలవాస్థకు చేరడంతో పెచ్చులుతున్నాయి. దీంతో అధికారులు భయం భయంగా పాలన కొనసాగిస్తున్నారు. భవనం శిథిలవాస్థకు చేరి పెచ్చులుడుతుండడంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పంచాయతీ కార్యదర్శి శశిధర్‌రెడ్డి తెలిపారు.

జీపీ భవనాలను వెంటనే నిర్మించాలి

మాగ్రామం గతంలో నాంచారిపేట గ్రామంలో కలిసి ఉండేది. నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లో కదిరేనిగూడెం నూతన గ్రామపంచాయతీగా ఏర్పడింది. కానీ ఇప్పటి వరకు జీపీ కార్యాలయం లేకపోవడంతో ముతబడిన ప్రాథమిక పాఠశాల భవనంలో కొనసాగుతోంది. 2023లో అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీతమహేందర్‌రెడ్డి నూతన గ్రామపంచాయతీకి శంకుస్థాపన చేసి రూ. 20లక్షలు మంజూరు చేశారు. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికైనా ఆధికారులు స్పందించి నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీల్లో జీపీ భవనాలు నిర్మించాలి..

-మహేశ్వర్‌, కదిరెనిగూడెం

పనులను ప్రారంభిస్తాం..

మోటకొండూరు మండలంలో నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరయ్యాయి. కాని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో జాప్యం జరిగింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోగానే జీపీ పనులను ప్రారంభించేలా చర్యలు తీపుకుంటమన్నారు.

-శ్రీనివాస్‌, పంచాయతీ రాజ్‌ ఏఈ, మోటకొండూరు

Updated Date - Oct 23 , 2025 | 12:30 AM