Share News

జలకళ ఏదీ?

ABN , Publish Date - Jul 22 , 2025 | 12:32 AM

వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంలేదు. దీంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. జిల్లావ్యాప్తంగా జలకళ అంతంత మాత్రంగానే ఉంది.

జలకళ ఏదీ?

నిండని చెరువులు, కుంటలు

ఇప్పటివరకు అలుగు పారని చెరువు

భారీగా వర్షాలు కురిస్తేనే నీరు చేరే అవకాశం

ఆందోళనలో రైతులు

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంలేదు. దీంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. జిల్లావ్యాప్తంగా జలకళ అంతంత మాత్రంగానే ఉంది. ముందు మురిపించిన వానాకాలంలో ఇప్పటివరకు భారీ వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

గత ఏడాదితో పోలిస్తే ఈసారి వర్షపాతం గణనీయం గా తగ్గింది. గతంలో జూన్‌, జూలై నెలల్లో కురిసిన వర్షాల కు చెరువులు, కుంటలు పొంగిపొర్లాయి. అయితే ఈసారి ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో జిల్లావ్యాప్తంగా చెరువులు, కుంటలు నీరు లేక బోసిపోతున్నాయి. గత వా రం రోజుల వరకు జిల్లాలో వర్షపాతం అత్యంత లోటుగానే ఉంది. నాలుగైదురోజులుగా కురుస్తున్న వర్షాలతో సాధారణస్థితికి చేరింది. జిల్లాలో వానాకాలంలో ఇప్పటివరకు సాధారణంగా 187.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 178.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయి తే ఈ వర్షపాతంతో చెరువులు, కుంటలు నిండే పరిస్థితి లేదు. భారీగా వర్షాలు కురిస్తే తప్ప, ఈసారి జలాశయాల్లో కి నీరు రావడం కష్టమే. వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాలో ఒక్క చెరువులోకి కూడా 50 శాతం మేరకు నీరు చేరలేదు. జిల్లాలోని 17 మండలాల్లో మొత్తం 1,080 చెరువులున్నాయి. వీటిలో 100 ఎకరాలకు పైగా ఉన్న చెరువులు 325ఉండగా, వంద ఎకరాల్లోపు ఉన్న చెరువులు 755 వరకు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు అలుగు పారిన చెరువులు, కుంటలు మొత్తమే లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో సగటున 7.3 మిల్లీమీటర్ల వర్షపాతం..

జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కురిసి న వర్షాలకు జిల్లాలో సగటున 7.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలకు భువనగిరి, బీబీనగర్‌, వలిగొండ, మోటకొండూరు, ఆలేరు మండలాల్లోని పలు గ్రామాల్లోని పొలాల్లోకి వర్షం నీరు చేరింది.

భూగర్భజలాలపై ప్రభావం

చెరువులు, కుంటల్లోని నీరు చేరనిపక్షంలో భూగర్భజలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉంది. జిల్లాలో మెజార్టీగా వ్యవసాయ బోరుబావులపై ఆధారపడి రైతులు పంటలను సాగుచేస్తారు. అయితే చెరువులు, కుంటల్లోకి ఆశించిన స్థాయిలో నీరు చేరలేదంటే బోర్లు తక్కువ మోతాదులో పోస్తాయి. దీంతో రైతులు వర్షాభావ పరిస్థితులనుంచి ఇంకా తేరుకోవడం కష్టంగా మారుతుంది. ఈసారి కాలం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నెలలో భారీ వర్షాలు కురిసినట్లయితే పంటల సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. తక్కువగా వర్షపాతం నమోదై, చెరువులు, కుంటల్లోకి సమృద్ధిగా నీరు చేరలేదంటే సాగు తగ్గే అవకాశం ఉంది.

మండలం వర్షపాతం

మి.మీ.లు

తుర్కపల్లి 8.7

రాజాపేట 0.3

మోటకొండూరు 0.7

భువనగిరి 0.9

బొమ్మలరామారం 0.2

బీబీనగర్‌ 0.9

పోచంపల్లి 3.8

చౌటుప్పల్‌ 38.8

నారాయణపూర్‌ 7.7

రామన్నపేట 30.5

వలిగొండ 26.1

అడ్డగూడూరు 1.9

Updated Date - Jul 22 , 2025 | 12:32 AM