Share News

ఎన్ని నిధులైనా ఇస్తా.. తుంగతుర్తిని అభివృద్ధి చేస్తా

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:38 AM

కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉంటున్న తుంగతుర్తి నియోజకవర్గానికి ఎన్ని నిధులైనా ఇస్తామని, అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లు అవకాశం ఇస్తే చేయని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని, దేవాదుల ద్వారా గోదావరి జలాలను అందించే వరకూ కాంగ్రెస్‌ ప్రభుత్వం విశ్రమించదన్నారు.

ఎన్ని నిధులైనా ఇస్తా.. తుంగతుర్తిని అభివృద్ధి చేస్తా

తిరుమలగిరి సభలో సీఎం రేవంత్‌రెడ్డి

పదేళ్లలో అభివృద్ధిని పట్టించుకోని ప్రభుత్వం

నూతన రేషన్‌కార్డుల పంపిణీకి శ్రీకారం

హాజరైన మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడ్డి, అడ్లూరి, పొంగులేటి

(ఆంధ్రజ్యోతి-సూర్యాపేట/మోత్కూరు): కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉంటున్న తుంగతుర్తి నియోజకవర్గానికి ఎన్ని నిధులైనా ఇస్తామని, అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పదేళ్లు అవకాశం ఇస్తే చేయని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని, దేవాదుల ద్వారా గోదావరి జలాలను అందించే వరకూ కాంగ్రెస్‌ ప్రభుత్వం విశ్రమించదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్‌కార్డుల పంపిణీని సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం సోమవారం ప్రారంభించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు శాసనసభా స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమా ర్‌, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మొదటగా తిరుమలగిరి పట్టణానికి చెందిన మహ్మద్‌ రజియాబీతో పాటు మరో 10 మందికి నూతన రేషన్‌కార్డులను అందజేశారు. అనంతరం సభలో సీఎం మాట్లాడుతూ ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ఏకరువు పెడుతూనే విమర్శలను గుప్పించారు. పదేళ్లు మీరు ఎట్లున్నరు అని అడిగినవాళ్లు ఉన్నారా అక్కలు అంటూ తమ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం చేప ట్టిన పథకాలను వివరించారు.

మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం తమకు ఖర్చు కింద కాదని, ఆడబిడ్డలకు కానుకగా తమ ప్రభుత్వం భావిస్తోందని, సోలార్‌ పవర్‌ ప్లాంట్లు, ఆర్టీసీలో ఆరు వందల బస్సులు, పెట్రోల్‌ బంక్‌లు మహిళలకే కేటాయిస్తూ వారిని కోటీశ్వరులను చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. జీరో వడ్డీ కింద రూ.21 వేల కోట్లు అప్పులిప్పిచ్చి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహకరిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం బెల్ట్‌ దుకాణాలు తెరిస్తే, తమ ప్రజాప్రభుత్వం రేషన్‌ దుకాణాలు తెరిచి కొత్త రేషన్‌కార్డులు, సన్నబియ్యం అందించి పేదల కడుపునింపుతోందన్నారు.

ఇది రైతు ప్రభుత్వం

ఎవరు అవునన్నా, కాదన్నా ఇది ముమ్మాటికీ రైతు ప్రభుత్వమేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతు భరోసా రాదని వగల ఏడుపు ఏడ్చిన వారికి తొమ్మిది రోజుల్లో రూ.9 వేలకోట్లు వేసి సమాధానమిచ్చామన్నారు. ఆగస్టు 15నాటికి రూ.21 వేల కోట్లు రుణమాఫీ కూడా పూర్తవుతుందన్నారు. రైతు భరోసా ఎగ్గొడితే బాగుండు, మాపంట పండు అని బీఆర్‌ఎస్‌ అనుకుంటే రైతులకు సంక్షేమ పథకాలు అందజేసి వారి కళ్లలో ఆనందాన్ని చూశామన్నారు. రాష్ట్రాన్ని పదేళ్లు పరిపాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం ఇవ్వాలన్న ఆలోచన కూడా రాలేదన్నారు.

పదేళ్లు ఏం చేశారు

మూడు రోజులిస్తే గోదావరి జలాలు తెస్తామంటున్న వారు పదేళ్లు ఏంచేశారని పదేళ్లు ఏం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాళేశ్వరం కూలేశ్వరం అయ్యిందన్నారు. తన ఊరికి మండలం చేసుకు, ప్రభుత్వ కార్యాలయాల భవానాలు నిర్మించుకోలేని వ్యక్తి కూడా మాట్లాడితే ఎలా ఎద్దేవా చేశారు. ఉమ్మడి జిల్లాలో ఒక్కడు గెలిచాడని, రానున్న ఎన్నికల్లో ఆయన్ను కూడా ఓడించాలని పిలుపునిచ్చారు. ఆయన సంగతి చూడటానికి మా దామన్న (మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి) ఒక్కరు చాలన్నారు. నిరుద్యోగులకు 18 మాసాల్లోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మిగిలిన మూడున్నర ఏళ్లలో లక్ష ఉద్యోగాలు ఇచ్చి తీరుతామన్నారు.

50 వేల మెజార్టీ ఇచ్చారు

ఎన్నికల్లో రూ.50 వేలతో పోటీ చేసిన సామేలును అభిమానంతో 51 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో రకరకాల వారుంటారని, ఈ ప్రాంతం వారు ఆవేశాన్ని దాచుకోలేరంటూ అందరిని కలుపుకపోవాలని ఎమ్మెల్యే సామేలుకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్ములను గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు. నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు వస్తే మూడింటిని నల్లగొండ జిల్లా వారికే ఇచ్చామని, రాష్ట్రంలో నల్లగొండకు ప్రత్యేక స్థానముందన్నారు. ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తే రెండు టర్మ్‌లు అధికారంలో ఉండటం రాష్ట్రం ఆనవాయితీ అని కాంగ్రెస్‌ రెండు టర్మ్‌లు అధికారంలో ఉంటుందన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు

తొలుత సభావేదిక వద్ద ఏర్పాటుచేసిన అభివృద్ధి పనుల శిలాఫలకాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. నాగారంలో రూ.3.75 కోట్లతో తహసీల్దార్‌ భవనం, రూ.3.50 కోట్లతో పోలీ్‌సస్టేషన్‌, రూ.4కోట్లతో మండల ప్రజా పరిషత్‌ భవనాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా తుంగతుర్తి మండలం వెలుగుపల్లి రూ.11.70 లక్షలతో చేపట్టే 10వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం నిర్మాణ పనులకు, అడ్డగూడూరులో రూ.3.75 కోట్లతో తహసీల్దార్‌ కార్యాలయ భవనం, రూ.4 కోట్లతో మండ ప్రజా పరిషత్‌ కార్యాలయ భవనం, రూ.3.50 కోట్లతో పోలీస్‌ స్టేషన్‌ భవన నిర్మాణ, తిరుమలగిరిలో రూ.5.30 కోట్లతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల భవననిర్మాణాల శిలాఫలకాలను ఆయన ప్రారంభించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ అధ్యక్షతన సభ జరిగింది.

పెద్దఎత్తున జనసమీకరణ

తిరుమలగిరి సభకు పెద్దఎత్తున జనసమీకరణ జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు వరంగల్‌ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు. సభలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బీర్ల అయిలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, బాలునాయక్‌, బీ.లక్ష్మారెడ్డి, జయధీర్‌రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్‌, అద్దంకి దయాకర్‌, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌, నల్లగొండ, భువనగిరి ఎంపీలు కుందూరు రఘువీర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్‌ కమిటీ చైర్మన్‌ బస్వరాజు సారయ్య, రైతు కమిషన్‌ సభ్యుడు చెవిటి వెంకన్నయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

సన్నబియ్యం, రేషన్‌కార్డులు చరిత్రాత్మక పథకాలు

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మోత్కూర్‌/తిరుమలగిరి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): పేదలకు సన్నబియ్యం, కొత్త రేషన్‌కార్డుల పంపిణీ చరిత్రాత్మక పఽథకాలని నీటిపారుదల, పౌరసరఫరాల మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తిరుమలగిరి సభలో ఆయన మాట్లాడుతూ, గత ఉగాది రోజున సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం హుజూర్‌నగర్‌లో ప్రారంభించామని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌కార్డుల కార్యక్రమాన్ని తుంగతుర్తి గడ్డ మీదుగా ప్రా రంభించడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభు త్వం 2.80కోట్ల మందికి రేషన్‌ బియ్యం ఇవ్వగా, దొడ్డు బియ్యం పేదలు తినేవారు కాదని, రీసైక్లింగ్‌కు... రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక ప్రజాప్రభుత్వం ఆలోచించి ఉపముఖ్యమంత్రి, మంత్రివర్గం ఆమోదంతో పేదల కడు పు నిండా అన్నం పెట్టాలనే సంకల్పంతో సన్నబియ్యం పఽథకం ప్రారంభించామన్నారు. ఇప్పు డు రాష్ట్రంలో 80శాతం జనాభా 3.10కోట్ల మం ది నాణ్యమైన సన్నబియ్యంతో కడుపునిండా అన్నం తింటున్నారన్నారు. ఉప ఎన్నికలు వచ్చి న చోట తప్పితే గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో కొత్త రేషన్‌కార్డులు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వంలో 5లక్షల నూతన రేషన్‌కార్డులు ఇస్తున్నామన్నారు. పాత కార్డుల్లో నూతనం గా సభ్యులను చేర్చామన్నారు. దేవాదుల ద్వారా తుంగతుర్తి, పాలకుర్తి నియోజకవర్గాలకు గోదావరి జలాలు అందించాలని, ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించేందుకు, కేతిరెడ్డి ఫీడర్‌ ఛానల్‌ పనులకు నిధులు మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. గతంలో ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించిన నాయకులు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారని, ఆ ప్రాజెక్ట్‌ కట్టింది వాళ్ల హయాంలోనే, కూలింది వాళ్ల హయాంలోనని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నిరుపయోగంగా ఉన్నా, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 281లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారన్నారు. బునాదిగాని కాల్వకు రూ.200కోట్లు మంజూరు చేశామని, భూసేకరణకు ఎమ్మెల్యేలు సహకరించాలన్నారు. నియోజకవర్గంలో చెరువుల మరమ్మతులు చేయిస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 12:38 AM