ఇంకో‘సారీ’... తప్పుచేయను
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:49 AM
మద్యం మత్తులో ఇంకోసారి తల్లిదండ్రులతో అమర్యాదగా వ్యవహరించను.. బాగా చూసుకుంటానని ఓ కుమారుడు వారి కాళ్లకు నమస్కరించి వేడుకున్నాడు.
తల్లిదండ్రులను వేధిస్తున్న కుమారుడికి ఎస్‌ఐ కౌన్సెలింగ్
పెనపహాడ్, మార్చి 13(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో ఇంకోసారి తల్లిదండ్రులతో అమర్యాదగా వ్యవహరించను.. బాగా చూసుకుంటానని ఓ కుమారుడు వారి కాళ్లకు నమస్కరించి వేడుకున్నాడు. గురువారం పెనపహాడ్ మండల పరిధిలోని భక్తాళాపురం గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నెమ్మాది సోమయ్య, పిచ్చమ్మలు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తుండగా, ఐదుగురు కుమార్తెలు కుమారుడు లింగయ్య ఉన్నాడు. అందరికీ వివాహాలు కాగా, కుమారుడు కూలి పనులకు వెళుతుంటాడు. తరచూ మద్యం తాగుతుండటంతో భార్య ఐదేళ్ల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి కూలి పనులకు వెళుతున్న కుమారుడు లిం గయ్య మద్యం మత్తులో ఇంటికి వచ్చి వృద్ధులైన తల్లిదండ్రులను వేధించేవాడు. తట్టుకోలేక గురువారం ఎస్‌ఐ గోపీకృష్ణను ఆశ్రయించారు. లింగయ్యకు కౌన్సెలింగ్ చేసిన ఎస్‌ఐ గోపీకృష్ణ ఇకపై తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టబోనని వారి పాదాలకు నమస్కరించి చెప్పించారు. తల్లిదండ్రులతో మర్యాదగా నడుచుకుంటానని, సత్ప్రవర్తననతో మెలుగుతానని చెప్పాడు.