అన్నదాత.. జాగ్రత్త!
ABN , Publish Date - Jun 25 , 2025 | 11:32 PM
వానాకాలం సీజన ప్రారంభమైంది. రైతులు పొలం పనుల్లో ఉండే ఈ కాలంలో కాస్తంత అప్రమత్తంగా అవసరం. లేదంటే విషపురుగుల బారిన పడే ప్రమాదం ఉంది. జూన నుంచి సెప్టెంబరు వరకు పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది.
వానాకాలం సీజన ప్రారంభమైంది. రైతులు పొలం పనుల్లో ఉండే ఈ కాలంలో కాస్తంత అప్రమత్తంగా అవసరం. లేదంటే విషపురుగుల బారిన పడే ప్రమాదం ఉంది. జూన నుంచి సెప్టెంబరు వరకు పాముల సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పంటలు వేయడంతో పాటు చెట్లు గుబురుగా పెరుగుతాయి. వాటిని ఆవాసంగా చేసుకోవడానికి పాములు బయటికి వస్తాయి. ఈ క్రమంలోనే పాముకాటు ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ నేపథ్యంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సూచనలు, సలహాలు..
(ఆంధ్రజ్యోతి-భూదానపోచంపల్లి)
ధాన్యపు గాదెలు, గడ్డివాములు ఉన్న చోట ఎలుకలు, తడిగా ఉన్నచోట ఉండే కప్పల కోసం పాములు వస్తుంటాయి. దూలాలు, కట్టెలు, పిడకల దొంతరల మధ్య పాములు, తేళ్లు, జెర్రి ఉండే ప్రమాదం ఉంది. చేల గట్లమీద, చెట్ల పొదల్లో, వ్యవసాయ బావులు, పంటల్లో ఇవి ఉంటాయి.ఇంటి పరిసరప్రాంతాల్లో చెట్లు దట్టంగా పెరిగిన చోట, పాత ఇళ్లు, రంధ్రాలు పాములు, తేళ్లకు ఆవాసాలు. పొలంగట్టుపై పాములు సంచరిస్తాయి. రాత్రివేళల్లో విధిగా టార్చిలైటు పట్టుకొని వెళ్లాలి. నీరు కట్టడానికి పొలాలకు మళ్లించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. నీటిలో సైతం పాములు దాక్కుని ఉంటాయి. పొరపాటున వాటి సమీపంలోకి వెళ్లినా, కాలితో తొక్కినా కాటువేసే ప్రమాదం ఉంది. పాడుబడ్డ బావులు, వాటి పరిసరాల్లో పాములు అధికంగా ఉంటాయి. విద్యుత మోటార్లలో కూడా పాములు ఒదిగిపోయి ఉంటాయి. మోటారు వేసే ముందు, స్టార్టర్ డబ్బా తలుపులు తీసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
పరిమాణాన్ని బట్టి తీవ్రత
పాములు రకరకాలుగా ఉంటాయి. కొన్ని పాములు కాటు వేసిన వెంటనే రక్తంలోకి విషం చేరుతుంది. దానిప్రభావం అధికంగా ఉంటుంది. ఒక్కో పాము కుడితే నెమ్మదిగా విషం రక్తంలోకి చేరుతుంది. స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. బాధితుడి శరీరంలోకి ఎక్కిన విషం పరిమాణాన్ని బట్టి ప్రమాద తీవ్రత ఉంటుంది. సాధారణ తాచుపాము విషప్రభావం కొంత ఆలస్యంగా మొదలవుతుంది. కింగ్ కోబ్రా, నాగుపాము విషప్రభావం త్వరగా మొదలవుతుంది. పాముకాటు వేసిన ప్రదేశంలో కోరల గాయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ప్రదేశంలో నొప్పిగా ఉంటుంది. ఏ పాము కాటువేసినా విష పురుగు కాటు వేసినా వెంటనే సమీపంలోని ఆసుపత్రికి వెళ్లాలి. నాటు వైద్యం చేయించుకోరాదు.
అత్యవసర మందులు
యాంటీబయోటిక్స్ సంక్రమణను నివారించడానికి లేదా నయం చేయడానికి ఉపయోగిస్తారు. అంతేగాక నొప్పి మందులు, పామురకం, లక్షణాల తీవ్రతను బట్టి నిర్దిష్ట యాంటీవినమ్ ఇస్తారు. పాము కాటుకు అత్యంత ప్రభావంతమైన చికిత్స యాంటీవీనమ్ ఇంజెక్షన. వీలైనంత త్వరగా యాంటీవీనమ్ పొందాలి. పాము యొక్క పరిమాణం, రంగు, ఆకారాన్ని తెలుసుకోవడం వల్ల వైద్యుడు పరిస్థితికి తగిన యాంటీవీనమ్‌ను ఎంచుకుంటారు.
బాధితుడిలో మార్పులు
కాటు ప్రదేశంలో నొప్పి
వికారం, వాంతులు
ముఖం, అవయవాల్లో తిమ్మిరి
గాయాల చుట్టూ వాపు, ఎరుపు
శ్వాస సమస్య ఉంటుంది.
అస్పష్టమైన దృష్టి
చెమటలు, లాలాజలము
విషం లేని పాముకాటు లక్షణాలు
కాటు ప్రాంతంలో నొప్పి
బర్నింగ్ సంచలనం
త్రోబింగ్ నొప్పి
చిన్నపంక్చర్ గాయాల మార్క్ కనిపిస్తుంది
అందుబాటులో మందులు
పాముకాటుకు అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వ్యాక్సిన అందుబాటులో ఉంది. ఈ సీజనలో పాముకాటుకు గురయ్యే వారు ప్రథమ చికిత్సచేసుకోవాలి. ఏదైనా పాముకాటుకు వెంటనే వైద్యసహాయం తీసుకోవాలి. వీలైనంత త్వరగా అత్యవసర సేవలకు కాల్ చేయాలి. పాముకాటు బాధాకరంగా లేకపోయినా దానిని ప్రాణాపాయకరమైనదిగా పరిగణించాలి. పాము ఎలా ఉందో, దాని రకం లేదా దాని పరిమాణాన్ని గుర్తించుకోవాలి. తద్వారా వైద్యులు తగిన మోతాదులో యాంటీవీనమ్ అందిస్తారు.
- డాక్టర్ శ్రీవాణి, భూదానపోచంపల్లి