Share News

అంగనవా‘డీలా’

ABN , Publish Date - Apr 17 , 2025 | 11:46 PM

అరకొర సౌకర్యాల నడుమ అంగనవాడీ కేంద్రాలు కొనసాగుతు న్నాయి. ఇరుకు గదుల్లో అసౌకర్యాల నడమ నిర్వాహకులు కాలం వెళ్ల దీస్తున్నారు.

అంగనవా‘డీలా’
మిర్యాలగూడలోని గాంధీనగర్‌లో రేకులగదిలో కొనసాగుతున్న అంగనవాడీ కేంద్రం

భానుడి భగభగ.. చిన్నారులు విలవిల

ఉక్కపోతతో తల్లడిల్లుతున్న చిన్నారులు

అరకొర సౌకర్యాల నడుమ అంగనవాడీ కేంద్రాలు కొనసాగుతు న్నాయి. ఇరుకు గదుల్లో అసౌకర్యాల నడమ నిర్వాహకులు కాలం వెళ్ల దీస్తున్నారు. రోజురోజుకు ఎండవేడి మి పెరుగుతుండటంతో చిన్నారులు ఉక్కపోతతో ఇబ్బందిని ఎదుర్కొం టున్నారు. అద్దె చెల్లింపు స్వల్పంగా ఉండటంతో పట్టణాల్లో సౌకర్యాలు ఉండే గదులు లభించడం లేదు. దీంతో చిన్నపాటి గదుల్లోనే కేంద్రాల నిర్వహణ జరుగుతోంది. దీంతో చిన్నారులు ఎండవేడిమికి డీలాపడి పోతున్నారు.

(ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ అర్బన)

రోజురోజుకూ ఎండవేడిమికి పెద్దలు తల్లిడిపోతుంటే చిన్నారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రధానంగా అంగనవాడీ కేంద్రాలకు వచ్చే కిశోర బాలబాలికలు ఇరుకు గదుల్లో ఇబ్బందిపడుతున్నారు. పౌష్టికాహార తయారీకోసం గ్యాస్‌బండ మంట తోడై గదులు వేడెక్కుతున్నాయి. ఈ పరిస్థితి ప్రధానంగా అద్దెభవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రజాప్రతినిధులు, పాలకులు శీతకన్ను ప్రదర్శిస్తున్న నేపథ్యంలో చిన్నారులకు అగచాట్లు తప్పడంలేదు. గదుల్లో ఫ్యాన్లు సరిగ్గా పనిచేయడంలేదు. గాలి, వెలుతురు కరువయ్యాయి.

ఒక్క వేములపల్లి మండలంలోనే పక్కాగా...

మిర్యాలగూడ ప్రాజెక్టుపరిధిలో 462అంగనవాడీ కేంద్రాలున్నాయి. మిర్యాలగూడ, మిర్యాలగూడ అర్బన ప్రాజెక్టుల పరిధిలో 119 కేంద్రాలు మాత్రమే పక్కా భవనాల్లో కొనసాగుతుండగా, 189కేంద్రాలను అద్దెభవనాల్లో నడిపిస్తున్నారు. మరో 154కేంద్రాలు ఉచిత భవనాల్లో పనిచేస్తున్నాయి. మి ర్యాలగూడ ప్రాజెక్టు పరిధిలోని వేములపల్లి మండలంలో పూర్తిస్థాయిలో అంగనవాడీ కేంద్రాలు పక్కా భవనాల్లో కొనసాగుతున్నాయి. మాడ్గులపల్లి, దామరచర్ల, మిర్యాలగూడ రూరల్‌, అర్బన, అడవిదేవులపల్లి, త్రిపురారం మండలాల పరిధిలో అద్దె భవనాల్లో కేంద్రాలు పనిచేస్తున్నాయి. కొన్ని కేంద్రాల్లో విద్యుత సౌకర్యం లేకపోవడంతో చీకటిగదుల్లో తీవ్ర అసౌకర్య పరిస్థితుల నడుమ చిన్నారులు కాలం వెళ్లదీస్తున్నారు. అంగనవాడీ కేంద్రాలకు 14,587మంది కిశోర బాలబాలికలు పూర్వవిద్యాభ్యాసం చేస్తుండగా సిబ్బంది కొరత వెంటాడుతోంది. ప్రాజెక్టు పరిధిలో 176 పోస్టులు ఖాళీగాఉన్నాయి. అందులో 26 కేంద్రాల్లో టీచర్ల కొరత ఉండగా, 150 ఆయా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. సిబ్బంది కొరత కారణంగా చిన్నారుల ఆలనాపాలన గాడితప్పి అస్తవ్యస్తంగా తయారవుతోంది. సిబ్బంది కొరత ఏర్పడిన కేంద్రాలను సమీప కేంద్రాల్లో విలీనం చేయడంతో చిన్నారుల సంఖ్య పెరిగి గదులు ఇరుకగా మారుతున్నాయి.

నకిరేకల్‌ నియోజకవర్గంలో..

(ఆంధ్రజ్యోతి-నార్కట్‌పల్లి)

అంగనవాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు ఉన్నా కొన్నిచోట్ల మరమ్మతులకు గురయ్యాయి. ముఖ్యంగా అద్దె భవనాల్లో కొనసాగిస్తున్న కేంద్రాల్లో అరకొర వసతులు మధ్య నిర్వహణ కొనసాగుతోంది. మినీ అంగనవాడీలను ప్రభుత్వం గతేడాది అంగనవాడీలుగా గుర్తించింది. అయితే మినీ అంగనవాడీలుగా కొనసాగిన భవనాల్లోనే అంగనవాడీ కేంద్రాలుగా నిర్వహిస్తున్నారు. వీటిలో చాలావరకు గ్రామీణ ప్రాంతాల్లోని రేకుల గదుల్లో కొనసాగుతుండటంతో వేసవి తాపానికి చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. నకిరేకల్‌ నియోజకవర్గంలో 317 అంగనవాడీ కేంద్రాలుండగా, వీటిలో 89 కేంద్రాలకే సొంత భవనాలున్నాయి. 163 కేంద్రాలను పలు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల భవనాల్లో ఉచిత అద్దె కింద నిర్వహిస్తున్నారు. మిగతా 65 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. నియోజకవర్గవ్యాప్తంగా గర్భిణులు 1,564 మంది, 1,335 మంది బాలింతలు ఉన్నారు. ఆయా కేంద్రాల్లో 6నెలల వయసులోపు చిన్నారులు 1,280, ఏడాది వయసులోపున్న చిన్నారులు 1,326, మూడేళ్ల వయసున్న పిల్లలు 6,950, ఆరేళ్ల లోపు చిన్నారులు 5,032 మంది ఉన్నట్లు తెలుస్తోంది.

అసౌకర్యాల నడుమ

(ఆంధ్రజ్యోతి-భువనగిరిరూరల్‌): యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు అంగనవాడీ కేంద్రాలు సక్రమంగా నిర్వహిస్తున్నా మ రికొన్ని నిర్వాహకుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లే దు. పలుచోట్ల అంగనవాడీ కేంద్రాల్లో సౌకర్యాలు లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, చౌటుప్పల్‌, పోచంపల్లి మోత్కూరు మునిసిపాలిటీలలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అందజేసే అద్దె నెలకు రూ.2 వేల నుం చి రూ.4 వేలు యజమానులు గిట్టుబాటు కాక అద్దెకు ఇచ్చేందు కు వెనుకాడుతున్నారు. దీనికితోడు 4 నెలల నుంచి 6నెలలకు ఒకసారి అద్దెచెల్లింపులు జరుగుతుండటంతో అద్దెకు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. వెరసి దొరికిన ఇరుకు గదుల్లోనే అంగనవాడీ కేంద్రాల నిర్వహణ కొనసాగుతోంది. ఈ విషయమై ఐసీడీఎస్‌ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లినా ఫలితం లేదు.

నిబంధనల మేరకు అద్దె చెల్లింపు

ప్రభుత్వ నిబంధనల మేరకు మునిసిపాలిటీ పరిధిలో రూ.2 వేల నుంచి రూ.4వేల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000 అద్దె చెల్లిస్తు న్నాం. పట్టణాల్లో తక్కువ అద్దెకు ఇల్లు ఇచ్చేందు కు నిరాకరిస్తున్నారు. అయినప్పటికీ అర్బన ప్రాంతా ల్లో అన్నివసతులతో కేంద్రాల నిర్వహణ చేపడుతున్నాం. వారం లో ఒకసారి తనిఖీలు చేపడుతున్నాం. పౌష్టికాహారం పంపిణీ, విధుల నిర్వహణ తదితర అంశాలపై ఆరా తీస్తున్నాం. పిల్లల తల్లిదండ్రులతో కూడా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం.

- శైలజ , సీడీపీవో భువనగిరి ప్రాజెక్టు

Updated Date - Apr 17 , 2025 | 11:46 PM