గంటసేపు క్యాబినలో విలవిల
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:50 AM
లారీని వెనక నుంచి టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో టిప్పర్ డ్రైవర్ క్యాబినలో చిక్కుకుని విలవిల్లాడాడు. గంటసేపు ఆయన రోదనలు అందరినీ కదిలించాయి. కాగా డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

హుజూర్‌నగర్ , మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : లారీని వెనక నుంచి టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో టిప్పర్ డ్రైవర్ క్యాబినలో చిక్కుకుని విలవిల్లాడాడు. గంటసేపు ఆయన రోదనలు అందరినీ కదిలించాయి. కాగా డ్రైవర్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిలుకూరు మండలం కొండాపురం శివారులోని గుట్ట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్ హుజూర్‌నగర్‌లోని హరికృష్ణ ఆసుపత్రి సెంటర్‌లో ముందుగా వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో టిప్పర్ డ్రైవర్ కొండా వర్మ తీవ్రంగా గాయపడి క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు. కాపాడాలని రోదిస్తూ కేకలు వేశాడు. గమనించిన స్థానికులు అందుబాటులో ఉన్న క్రేన్ సహాయంతో డ్రైవర్‌ను క్యాబిన్ నుంచి బయటకుతీశారు. ఇందుకోసం సుమారు గంటపాటు శ్రమించారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుంచి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కాగా సంఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని ఎస్‌ఐ ముత్తయ్య తెలిపారు.