Share News

ప్రాణాలు తీసిన మతిమరుపు

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:18 AM

మతిమరుపు ఓ వృద్ధుడి ప్రాణంతీసింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తిరుమలాపురంలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ రాంమూర్తి, తిరుమలాపురం స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

ప్రాణాలు తీసిన మతిమరుపు
రాములు(ఫైల్‌)

చింతపల్లి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): మతిమరుపు ఓ వృద్ధుడి ప్రాణంతీసింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తిరుమలాపురంలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ రాంమూర్తి, తిరుమలాపురం స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిరుమలాపురం గ్రామానికి చెందిన గార్లపాటి రాములు(80) కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయన భార్య పదేళ్ల కిందట మృతి చెందగా కుమార్తె ఉన్నారు. కుమార్తె భారతమ్మకు వివాహంకాగా మండలంలోని కుర్మేడు గ్రామంలో ఉంటున్నారు. కొంతకాలంగా రాములు కుర్మేడులోని కుమార్తె ఇంట్లోనే ఉంటున్నాడు. కొంతకాలంగా రాములు మతిమరుపు సమస్యతో బాధపడుతున్నాడు. స్వగ్రామం తిరుమలాపురంలో బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్న విషయం తెలుసుకుని బుధవారం గ్రామానికి వచ్చారు. గురువారం రాత్రి గ్యాస్‌ స్టవ్‌పై వంట చేసుకుని భోజనం చేసి నిద్రించాడు. గ్యాస్‌ ఆఫ్‌ చేయకుండా నిద్రకు ఉపక్రమించాడు. కొంత సమయం తర్వాత రాములు లేచి చుట్ట తాగుతుండగా గ్యాస్‌ సిలిండర్‌ పేలి పైకప్పు ధ్వంసమై స్లాబ్‌ కింద ఉన్న రాములుపై పడింది. భారీ శబ్ధం రావడంతో మనుమడి స్నేహితుడు కుర్మేటి నవీన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎక్స్‌కవేటర్‌తో స్లాబ్‌ కప్పును తొలగించగా రాములు శరీరం పూర్తిగా కాలిపోయి మృతి చెంది కనిపించాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాములు మనుమడు గార్లపాటి ప్రవీణ్‌ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Aug 23 , 2025 | 12:18 AM