అమాత్యులు పరిష్కరిస్తారని..
ABN , Publish Date - Jul 01 , 2025 | 11:57 PM
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టాక బుధవారం సమీక్షా సమావే శం నిర్వహించనున్నారు.
ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం నేడు
మొదటిసారి వస్తున్న నూతన ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమగ్రంగా చర్చించే అవకాశం
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
(ఆంధ్రజ్యోతిప్రతినిధి,నల్లగొండ): ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమశాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు చేపట్టాక బుధవారం సమీక్షా సమావే శం నిర్వహించనున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించే ఉమ్మడి జిల్లా స్థాయి సమీక్షా సమావేశానికి శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి,మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, మూడు జిల్లాల కలెక్ట ర్లు, ఇతర శాఖల అధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశం ద్వారా పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుంద ని జిల్లా ప్రజలు ఆశలు పెంచుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో నెలకొన్న కీలకమైన సమస్యలను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సమీక్షా సమావేశంలో చర్చించి వా టి పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, రైతుభరోసా, సన్నబియ్యం పంపిణీ తో పాటు, ఉమ్మడి జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమీక్ష జరగనుంది. ప్రధానంగా ఏఎమ్మార్పీ కాల్వల మరమ్మతులు, బ్రాహ్మణవెల్లంల, డిండి ఎత్తిపోతల పథకాలు, గంధమళ్ల రిజర్వాయర్లకు భూసేకర ణ అంశాలను చర్చించే అవకాశం ఉంది. వీటి తో పాటు పలు ప్రాంతాల్లో గ్రామీణ రోడ్లు నిర్మించాల్సి ఉండగా, నిధుల కోసం ఎమ్మెల్యేలు ప్రస్తావించాలనే సూచనలు వస్తున్నాయి. వానాకాలం సీజన్ ఆరంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై వైద్య, ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసేందుకు అవసరమై న సూచనలివ్వడంతో పాటు, గ్రామ పంచాయతీల్లో బ్లీచింగ్, పారిశుధ్యం నిర్వహణ పనులు సవ్యంగా కొనసాగేలా ఆదేశాలివ్వాలని, అదేవిధంగా తాగునీటి పైప్‌లైన్ల మరమ్మతులు, వాటర్ ట్యాంకులను తక్షణం శుభ్రం చేయించడంపై ప్రత్యేక దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.
డబుల్ బెడ్‌రూమ్‌లు కేటాయింపులకు ఎదురుచూపు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వ హ యాంలో అసంపూర్తిగా నిలిచిన డబుల్‌బెడ్‌రూ మ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజే సేందుకు ఈ సమావేశం ద్వారా ఆదేశాలిస్తారని అర్హులు ఆశిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4,716 డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తిచేయడం తో పాటు, ఆయా కాలనీల్లో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు వాటిని అందజేయాలని కోరుతున్నారు. ఇన్‌చార్జి మంత్రి సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపికచేయాల్సి ఉండగా ఇళ్ల పరిస్థితిపై మూడు జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో వివరిస్తారని తెలుస్తోంది.
ఎత్తిపోతల పథకాలపై చర్చించే అవకాశం
ఉమ్మడి జిల్లాలో నిర్వహణలో ఉన్న ఐడీసీ ఎత్తిపోతల పథకాలన్నింటినీ ఈ సీజన్ ఆరంభం నాటికే అందుబాటులోకి తేవాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలుమార్లు సమీక్షా సమావేశాల్లో అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలను సైతం వేగవంతంగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. అయితే వీటి పనుల పురోగతి ఆశించిన రీతిలో లేదని, క్షేత్రస్థాయి పరిస్థితులపై మంత్రి, ఎమ్మెల్యేలు సమావేశంలో చర్చించి స్పష్టమైన మార్గదర్శనం చేస్తారని రైతులు ఆశిస్తున్నారు. వీటితో పాటు కీలకమైన ఎస్‌ఎల్‌బీసీ సొరంగమార్గం పనులు ఎప్పటి నుంచి తిరిగి చేపడతారనే అంశంపై మంత్రులు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మంగళవారం ఉదియా దిత్యభవన్‌లో సమీక్షా వేదికను, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. సమీక్ష అనంతరం మంత్రులు ప్రారంభించే ఆర్‌అండ్‌బీశాఖ ఎస్‌ఈ కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. సమీక్ష సమావేశంలో చర్చించే అంశాలకు సంబంధించిన నోట్స్, పవర్‌పాయింట్ ప్రజంటేషన్‌కు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీవో అశోక్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, ఈఈ శ్రీధర్‌రెడ్డి, ఏవో మోతీలాల్, తదితరులు ఉన్నారు.
నేడు సైదాపురం గ్రామానికి మంత్రి రాకా
యాదగిరిగుట్ట రూరల్, జూలై 1, (ఆంధ్రజ్యోతి)ః యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామానికి నేడు రాష్ట్ర ఎస్పీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ, ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జీ మంత్రి అడ్ల్లూరి లక్ష్మణ్‌కుమార్ రానున్నట్లు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. మంగళవారం గుట్టలో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సైదాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కావిస్తారని తెలిపారు. కార్యాక్రమానికి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని చెప్పారు.