Share News

ఏడేళ్లు పూర్తి కావస్తున్నా..

ABN , Publish Date - Jul 22 , 2025 | 12:37 AM

కొత్త మునిసిపాలిటీలు ఏర్పడి ఏడేళ్లు కావస్తున్నా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కొత్త పోస్టులు మంజూరు కాకపోవడంతో, అరకొర సిబ్బందితో సేవలు అందడంలేదు.

ఏడేళ్లు పూర్తి కావస్తున్నా..

కొత్త మున్సిపాలిటీలకు పోస్టుల మంజూరేదీ

అరకొర సిబ్బందితో అవస్థలు

(ఆంధ్రజ్యోతి-మోత్కూరు): కొత్త మునిసిపాలిటీలు ఏర్పడి ఏడేళ్లు కావస్తున్నా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. కొత్త పోస్టులు మంజూరు కాకపోవడంతో, అరకొర సిబ్బందితో సేవలు అందడంలేదు. జిల్లాలో గతంలో భువనగిరి ఒక్కటే మునిసిపాలిటీ ఉండగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018 ఆగస్టు 2న మోత్కూరు, ఆలేరు, యాదగిరిగుట్ట, బీబీనగర్‌ చౌటుప్పల్‌, భూదాన్‌పోచంపల్లి మునిసిపాలిటీలను కొత్తగా ఏర్పాటు చేసింది. కొత్త మునిసిపాలిటీలు ఏర్పాటు చేయడానికి మండలకేంద్రాల్లో తగినంత జనాభా లేనిచోట సమీప గ్రామాలను కలిపి కొత్త మునిసిపాలిటీలు చేశారు. నాడు మునిసిపాలిటీల్లో విలీనానికి కొన్ని గ్రామాల ప్రజలు, నాయకులు వ్యతిరేకించగా, గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించి మరికొన్ని గ్రామాల ప్రజలు, నాయకులు సుముఖత తెలిపారు. కొత్త మునిసిపాలిటీలకు కొంతమేర నిధులు వస్తున్నా అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే ఉందన్న విమర్శలున్నాయి.

పరిపాలనలో ఇబ్బందులు ..

కొత్త మునిసిపాలిటీలు ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా, నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోగాని, ఇప్పుడున్న కాంగ్రెస్‌ ప్రభుత్వంలోగాని మునిసిపాలిటీలకు పూర్తిస్థాయిలో పోస్టులు మంజూ రు చేయక పోవడంతో పరిపాలనలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కన్పిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఏ పనీ సకాలంలో కావడం లేదని, అభివృద్ధి పనులపై పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలున్నాయి. మునిసిపాలిటీల్లో అన్నింటికీ మునిసిపల్‌ కమిషనరే జవాబుదారీ కావాల్సి వస్తున్నదంటున్నారు. మోత్కూరు మునిసిపాలిటీలో ఏఈ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌, టీపీఎస్‌, రెవెన్యూ ఆఫీసర్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, సీనియర్‌ అసిస్టెంటు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, హెల్త్‌ అసిస్టెంట్‌, సిస్టమ్‌ అసిస్టెంటు, సిస్టమ్‌ మేనేజర్‌ పోస్టులు లేవు. కొన్నింటికి ఇన్‌చార్జీలు ఉండి వారానికోసారో, రెండుసార్లో మొక్కుబడిగా వచ్చి పోతుండగా కొన్ని పోస్టులకు బాధ్యులే లేరు. జిల్లాలో మిగ తా కొత్త మునిసిపాలిటీల పరిస్థితి కూడా ఇలాగే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.. మోత్కూరులో రూ.4కోట్లతో అన్ని వసతులు, ఒక్కో అధికారికి ఒక గది ఉండేలా మునిసిపల్‌ కార్యాలయ భవనం నిర్మిస్తున్నారు. కార్యాలయ భవనం ప్రారంభమయ్యాక అందులో అధికారులు లేకుంటే భవనం నిర్మించి లాభమేమిటని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Jul 22 , 2025 | 12:37 AM