చి‘వరి’కి మిగిలింది కన్నీరే
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:50 AM
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వేసవికి ముందే నిలువునా ఎండిపోతున్నాయి.

ఎండిన పైరు పశువులకు మేతగా
ట్యాంకర్లతో నీటిని పోసి పంటలను కాపాడుతున్న రైతులు
మునగాల రూరల్/ సంస్థాననారాయణపురం/ మోటకొండూరు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వేసవికి ముందే నిలువునా ఎండిపోతున్నాయి. దీంతో రైతులు పొట్టదశలో ఉన్న తమ పంటను కాపాడుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాననారాయణపురం మండల కేంద్రానికి చెందిన కొండ సత్తయ్య తనకున్న భూమిలో ఎకరం వరి సాగు చేశాడు. నెల రోజుల నుంచి బోరులో నీటిమట్టం తగ్గింది. దీంతో బోరు ద్వారా వచ్చే నీళ్లు పొలానికి సరి పోవడం లేదు. ఈ క్రమంలో పొలం వాడిపోతోంది. చేతికొచ్చిన సమయంలో వరి ఎండిపోతుండడంతో రైతు పంటను కాపాడుకోవడానికి రెండు రోజులకోసారి ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చి పొలానికి పారిస్తున్నాడు. ఒకసారి ట్యాంకర్ నీటిని పోస్తే రూ.700 ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 15 రోజులుగా టాంకర్ల ద్వారా నీటిని తెచ్చి వరి చేనుకు పోసి పంటను కాపా డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎకరం పొలం సాగు చేయడానికి రూ.70వేలు ఖర్చువుతుందని చెప్పాడు. తమలాంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సత్తయ్య కోరారు.
మూడు రోజులకో ట్యాంకర్
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రానికి చెందిన బాల్ద శ్రీనివాస్ తనకున్న 3ఎకరాల్లో ఒక్క ఎకరంలో వరి సాగు చేశాడు. గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు, బావులోంచి నీళ్లు రావడం లేదు. దీంతో 10 గుంటలు ఎండిపోయింది. బోరు లోంచి నీరు తగ్గి దారాల వస్తుండడంతో పొట్టదశలో ఉన్న 30 గుంటల పొలాన్ని కాపాడుకోవడానికి ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నాడు. మూడు రోజులకు ఒకసారి ట్యాంకర్ ద్వారా నీరు పెడుతున్నట్లు రైతు తెలిపాడు.
సూర్యాపేట జిల్లాలో
సూర్యాపేట జిల్లాలోని మోతె, మునగాల మండలాల్లోని నాన కెనాల్ ఆయకట్టు గ్రామాల్లో వరి పంట ఎండిపోయే దశకు చేరుకుంది. ఎస్పారెస్పీ జలాలను విడుదల చేయాలని స్థానిక రైతులు డిమాండ్ చేస్తున్నారు. మోతె మండలంలోని అన్ని గ్రామాలు, మునగాల మండలంలోని నాన కెనాల్ ఆయకట్టు గ్రామాలైన రేపాల, నర్సింహులగూడెం, జగన్నాథపురం, విజయరాఘవపురం, సీతానగరం, కలకోవ రైతులు ఎస్సారెస్పీ జలాలలపై ఆధారపడి యాసంగి సీజనలో అధిక మొత్తంలో వరిని సాగు చేశారన్నారు. ప్రస్తుతం నీరు లేక పొట్ట దశలో ఉన్న వరి పైర్లు నీరు లేక ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈ ప్రాంతాలకు నీటిని విడుదల చేసి నాన కెనాల్ ఆయకట్టు రైతులను ఆదుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్పారెస్పీ) నీరు రాక పైరు ఎండిపోయిందని మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన కౌలు రైతు బట్టిపల్లి సుందరయ్య వినూత్నంగా నిరసన తెలిపారు. ఎస్సారెస్పీ నీరు రాక ఎండిపోయిన పొలంలో ద్విచక్ర వాహనంతో పలుమార్లు చక్కర్లు కొట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. సాగు కోసం రూ.2లక్షలు అప్పు తెచ్చి సాగు చేశానని, పెట్టిన పెట్టుబడి కూడా రాక అప్పులపాలయ్యాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన పొలంలో గొర్రెలు మేపుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా తమ ప్రాంతానికి ప్రభుత్వం సాగు నీరందించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.
గాలయ్యది దీన పరిస్థితి
సంస్థాన నారాయణపురం మండల కేంద్రానికి చెందిన మరో రైతు నూకం గాలయ్యది దీన పరిస్థితి. తనకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తనకున్న భూమిలో వరి సాగు చేశాడు. మొదట బోరు బాగానే నీరు పోసింది. కొన్ని రోజుల నుంచి బోరులో నీటిమట్టం తగ్గిపోయింది. బోరులో నీరు తగ్గిపోవడంతో సాగుచేసిన వరి చేను వాడు పట్టింది. ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు రైతు గాలయ్య విశ్వ ప్రయత్నాలు చేశాడు. కొన్ని రోజులు ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి పం టలు రక్షించే ప్రయత్నం చేశాడు. అయినా వరి పంటకు పూర్తిస్థాయిలో నీరు అందక వరి చేను ఎండిపోయింది. కళ్లెదుటే పంట ఎండిపోవడంతో రైతుకు దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. తప్పని పరిస్థితుల్లో ఎండిపోయిన పంట చేలో తనకున్న పశువులను మేపుతున్నాడు. పైరు ఎండిపోయి నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతు గాలయ్య ప్రభుత్వాన్ని కోరుతున్నారు.