భక్తుడూ భగవంతుడైన ఆలయం
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:17 AM
భగవంతుడితో సమానంగా భక్తుడు సేవలందుకుంటున్న క్షేత్రం నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గుట్టల్లోని తులసీసాద్ మహరాజ్ ఆలయం.
(ఆంధ్రజ్యోతి-దేవరకొండ)
భగవంతుడితో సమానంగా భక్తుడు సేవలందుకుంటున్న క్షేత్రం నల్లగొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి గుట్టల్లోని తులసీసాద్ మహరాజ్ ఆలయం. నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి సమీపంలోని కృష్ణానది ఒడ్డున ఉన్న గుట్టల్లో 200 ఏళ్ల కిందట బాలాజీ వేంకటేశ్వరస్వామి వెలిసినట్లు స్థానికుల నమ్మకం. అయితే స్థానికుడైన తులసీసాద్ అనే భక్తుడు పరమనిష్ఠతో స్వామిని ఉపవాస దీక్షలతో పూజలు చేశాడు. దీంతో అతడికి స్వామి దర్శనమిచ్చినట్లు పూర్వీకులు కథనం. అప్పటి నుంచి తులసీసాద్‌ను కూడా గిరిజనులు దైవ ంగా కొలవడం ప్రారంభించారు. బాలాజీ తులసీసాద్ పేరుతో రూ.కోటితో దేవాలయాన్ని నిర్మి ంచి గిరిజనులు ఆరాధ్యదైవంగా కొలుస్తున్నారు.
ఏడు తరాల నుంచి వాకునావత పాడ వంశానికి చెందిన వారు పూజారులుగా కొనసాగుతున్నారు. చుట్టూ నలమల కొండలు, అడవలు, మూడు వైపులా కృష్ణా జలాలు మధ్యలో గుట్టపై వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించి స్వామి వారితో పాటు తులసీసాద్‌కు పూజలు చేస్తున్నారు. స్థానికులతో పాటు పరిసర తండాల భక్తులతో పాటు ఆంధ్రప్రదేశ రాష్ట్రం మాచర్ల, ప్రకాశం, వివిధ జిల్లాల నుంచి భక్తులు దేవాలయానికి వచ్చి వేంకటేశ్వరస్వామితో పాటు తులసీసాద్‌మహరాజ్‌కు పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకుంటారు.
ప్రతీ శనివారం భక్తులు పెద్దసంఖ్యలో దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. కోరిన కోరికలు నెరవేర్చే దైవంగా బాలాజీ, తులసీసాద్‌మహరాజ్ దేవాలయానికి పేరొందింది. పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి పొందిన వైజాగ్‌కాలనీకి వచ్చే పర్యాటకులు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయాన్ని సందర్శించి వెళ్తుంటారు. ప్రతీ ఏడాది శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ నిర్వాహకులు పూజారి వాకునావత బిక్కునాయక్ తెలిపారు.
ఆలయానికి ఇలా వెళ్లొచ్చు...
కాచరాజుపల్లిలోని బాలాజీతులసీసాద్ దేవాలయానికి ఇలా వెళ్లాల్సి ఉంటుంది. దేవరకొండ నుంచి పోలేపల్లి మీదుగా పెద్దమునిగల్, వైజాగ్‌కాలనీ, దుబ్బతండాకు రోడ్డు ఉంది. దేవరకొండ నుంచి తులసీసాద్ దేవాలయం 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆటోలు, ప్రైవేట్ వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు.
దేవాదాయ శాఖ సహకరించాలి
వకునావత వంశానికి చెందిన వారం బాలాజీతులసీసాద్‌మహరాజ్ దేవాలయంలో పూజలు చేస్తున్నాం. భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుతుండటంతో భక్తుల రద్దీ పెరిగింది. దేవాదాయ శాఖ దేవాలయ అభివృద్ధికి సహకరించాలి. దేవాలయం చుట్టు కొండలు, గుట్టలు, నదీ జలాలు ఉండడంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి.
వాకునావత బిక్కునాయక్, ఆలయ పూజారి