అభ్యసన సామర్థ్యాలపై అధ్యయనం
ABN , Publish Date - Mar 11 , 2025 | 01:11 AM
విద్యారంగంతో పాటు అన్ని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా అనంతరం మొదటి బ్యాచ్‌గా పరిగణించే రెండో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఎన్‌సీఈఆర్‌టీ చేపట్టిన అధ్యయనం జిల్లాలో సోమవారం ప్రారంభమంది.

మూడు రోజులు 50 పాఠశాలల్లో
రెండో తరగతి విద్యార్థుల సృజనాత్మకతను అంచనా వేసే లక్ష్యం
భువనగిరి టౌన్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): విద్యారంగంతో పాటు అన్ని వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిన కరోనా అనంతరం మొదటి బ్యాచ్‌గా పరిగణించే రెండో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఎన్‌సీఈఆర్‌టీ చేపట్టిన అధ్యయనం జిల్లాలో సోమవారం ప్రారంభమంది. జిల్లాలో ఎంపిక చేసిన 50 ప్రభుత్వ పాఠశాలల్లో మూడు రోజులపాటు ఈ సర్వే కొనసాగనుంది. ప్రాథమిక విద్యలోనే విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి లోపాలను అధిగమించేలా ప్రణాళికల రూపకల్పనకు ఈ సర్వే వేదిక కానుంది. ఇప్పటికే అమలులో ఉన్న తొలిమెట్టులో భాగంగా ఈ సర్వే కొనసాగనుంది.
50 పాఠశాలలు
జిల్లాలో 484 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో రెండో తరగతి 3,018 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే సర్వే కోసం ఎన్‌సీఈఆర్‌టీ ప్రతీ జిల్లాలో 50 పాఠశాలలను ఎంపిక చేసింది. ప్రతి జిల్లాలో 50 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్‌ను అందుకు నియమించింది. ఈనెల 10, 11, 12వ తేదీల్లో సర్వే కొనసాగనుంది. ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన ప్రశ్నావళి ఆధారంగా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్ రెండో తరగతి విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. మీడియం ఆధారంగా తెలుగు, ఇంగ్లీష్ పుస్తకం చదవడం, రాయడం, అక్షరాలు, అంకెల గుర్తింపు, అవగాహన తదితర సామర్థ్యాలను అంచనా వేస్తారు. ప్రతీ పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. అంతకు తక్కువగా విద్యార్థులు ఉంటే అందరినీ సర్వే ఆధారంగా ప్రశ్నిస్తారు. సర్వేను జిల్లా విద్యాశాఖ పర్యవేక్షిస్తుంది. సోమవారం తెలుగు సామర్థ్యాల పరిశీలన పూర్తి కాగా, 11న ఆంగ్లం, 12న గణితం సర్వే కొనసాగనుంది.
సెల్ ఫోన్స్‌కు బానిసలుగా
బాల్యానికి సెల్ ఫోన్స్ సంకెళ్లుగా మారాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వీలున్నపుడల్లా సెల్‌ఫోన్‌లో గేమ్స్ ఆడటం, ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ చూడటం పరిపాటిగా మా రుతోంది. తల్లిదండ్రులు ఇంటిలో ఉన్న సమయం అంతా చిన్నపిల్లల చేతుల్లోనే ఫోన్లు ఉంటున్నాయి. పిల్లలు అన్నం తినాలన్నా, ఇంటి పనులకు ఆటంకం కలిగించవద్దన్నా, చివరికి వారికి ఆలనాపాలనా శ్రమ తప్పాలన్నా పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తే సరిపోతుంది అనే భావనలో కొందరు తల్లిదండ్రులు ఉంటున్నారు. అక్షరజ్ఞానం రాకముందే పిల్లలకు స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడటం, కార్టూన్స్, రీల్స్ చూడటంపై అవగాహన వస్తుండటం పలు అనర్థాలకు కారణం అవుతోంది. ఈ నేపథ్యంలో రెండో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న సర్వేలో విద్యాసామర్థ్యాల సృజనాత్మకతపై అధికార వర్గాలలో ఆసక్తి నెలకొన్నది. అయితే పిల్లలు సెల్‌ఫోన్‌కు బానిస కావడానికి తల్లిదండ్రుల వైఖరే కారణమని, దీంతో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పకడ్బందీగా సర్వే : కె.సత్యనారాయణ, డీఈవో
జిల్లాలో రెండో తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాలను అంచనా వేసేందుకు చేపట్టిన సర్వే పకడ్బందీగా సాగుతోంది. విద్యార్థుల చదు వు, గుర్తింపు, అవగాహన తదితర సామర్థ్యాలను ఈ సర్వే ద్వారా అంచనా వేస్తారు. సర్వేలో వెల్లడైన అం శాల ఆధారంగా విద్యాశాఖలో ఎన్‌సీఈఆర్‌టీ సంస్కరణలు, నూతన విధానాలను అమలు చేసే అవకాశం ఉంది. అయితే పిల్లలపై పెనుప్రభావం చూపుతున్న స్మార్ట్‌ఫోన్‌లను తల్లిదండ్రులు ఇవ్వకుంటే మంచిది.