Share News

ఎంఎంటీఎస్‌ పనుల్లో ముందడుగు

ABN , Publish Date - May 25 , 2025 | 12:25 AM

జిల్లా వాసుల ఎంఎంటీఎస్‌ కల సాక్షాత్కారం కాబోతుంది. మొదటగా ఘట్కేసర్‌ నుంచి భువనగిరి వరకు ఆ తర్వాత యాదాద్రి (రా యిగిరి) స్టేషన్‌ వరకు పొడిగించిన ఎంఎంటీఎ స్‌ పనుల్లో భారీ ముందడుగు పడింది. దీంతో యాదాద్రి స్టేషన్‌ పునరభివృద్ధి పనులు కూడా వేగవంతమయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి.

ఎంఎంటీఎస్‌ పనుల్లో ముందడుగు

రూ.464 కోట్లతో నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా

ఫైనల్‌ లొకేషన్‌ సర్వేకు రూ.30 కోట్లు విడుదల

యాదాద్రి స్టేషన్‌ అభివృద్ధి పనుల్లో వేగం

తీరనున్న ప్రయాణ కష్టాలు

(ఆంధ్రజ్యోతి-భువనగిరి టౌన్‌): జిల్లా వాసుల ఎంఎంటీఎస్‌ కల సాక్షాత్కారం కాబోతుంది. మొదటగా ఘట్కేసర్‌ నుంచి భువనగిరి వరకు ఆ తర్వాత యాదాద్రి (రా యిగిరి) స్టేషన్‌ వరకు పొడిగించిన ఎంఎంటీఎ స్‌ పనుల్లో భారీ ముందడుగు పడింది. దీంతో యాదాద్రి స్టేషన్‌ పునరభివృద్ధి పనులు కూడా వేగవంతమయ్యే అవకాశాలు ఏర్పడ్డాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఘట్కేసర్‌ నుం చి భువనగిరి వరకు రూ.330కోట్లతో రైల్వే శాఖ ఎంఎంటీఎ్‌సను ప్రతిపాదించింది. ఈ మొత్తం లో రూ.220కోట్లు రాష్ట్ర ప్రభుత్వం, మిగతా రూ.110కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటాగా పనులు చేపట్టాల్సి ఉండే ది. కానీ తనవంతు వాటా నిధులను నాటి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంలో విముఖత చూపడంతో కేంద్రమే ఎంఎంటీఎస్‌ పనులను చేపడుతుందని, 2023 లో నాటి, నేటి కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఈక్రమంలో రాష్ట్రంలోని మూడు అమృత్‌ రైల్వేస్టేషన్లను ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ఈ నెల 22న ప్రారంభించిన నేపథ్యంలో పెరిగిన అంచనా వ్యయంతో రూ.464 కోట్లతో కేంద్రమే ఎంఎంటీఎ్‌సలను చేపడుతున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరోమారు స్పష్టం చేయగా, మూడో లైన్‌ లైవ్‌ లొకేషన్‌ సర్వేకోసం రైల్వే శాఖ రూ.30కోట్లు విడుదల చేయడంతో పనులపై స్పష్టత వచ్చినట్లయింది.

ఊపందుకోనున్న యాదాద్రి అమృత్‌ స్టేషన్‌ అభివృద్ధి పనులు

ఎంఎంటీఎస్‌ పనులపై స్పష్టత రావడంతో యాదాద్రి స్టేషన్‌ అమృత్‌ పనులు ఊపందుకోనున్నాయి. అత్యున్నత ప్రమాణాలు, సదుపాయాలతో విమానాశ్రయాలను తలపించేలా రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దే లక్ష్యంతో అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీం(ఏబీఇ్‌సఎ్‌స)కు ఎంపికైన యాదాద్రి రైల్వే స్టేషన్‌ పునరాభివృద్ధికి రూ.24.45కోట్ల విలువైన పనులను 2023, ఆగస్టు 6న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. కానీ ఎంఎంటీఎస్‌ పనుల్లో కొరవడిన స్పష్టతతోపాటు మరికొన్ని సాంకేతిక కారణాలతో అమృత్‌ పనుల్లో జాడ్యం ఆవహించింది. వాస్తవానికి పనులు ప్రారంభమైన ఏడాదికే అభివృద్ధి చేసిన అమృత్‌ యాదాద్రి స్టేషన్‌ ప్రారంభోత్సవం జరగాల్సి ఉంది. కానీ పై రెండు కారణాలతో స్టేషన్‌ పనులు సుమారు ఏడాది ఆలస్యంగా సాగుతున్నాయి. ఈ మేరకు ఎంఎంటీఎస్‌ పనులకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో అమృత్‌ పనులు కూడా వేగవంతమవుతాయని అధికారులు పేర్కొంటున్నారు.

తీరనున్న ప్రయాణ కష్టాలు

ఎంఎంటీఎ్‌సతో హైదరాబాద్‌-భువనగిరి మధ్య ప్రయాణ కష్టాలు తీరుతాయి. అలాగే ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్టకు హైదరాబాద్‌ నలుమూలలనుంచి ప్రయాణం సుగుమం కానుంది. అంతేకాక జిల్లాలోని బీబీనగర్‌కు నేరుగా భువనగిరి వరకు ఎంఎంటీఎ్‌సలో వచ్చి జిల్లాలోని ఇతర ప్రాంతాలకు, పొరుగునే ఉన్న జనగామలోని గమ్యస్థానాలకు సకాలంలో చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి భువనగిరి వరకు గంటలోపు, బస్సు చార్జీలతో పోలిస్తే సగంలోపు చార్జీలతోనే ఎంఎంటీఎస్‌ ద్వారా చేరుకోవచ్చు. ఫలితంగా ఎంఎంటీఎస్‌ హాల్టులు ఉండే జిల్లాలోని రైల్వే స్టేషన్ల పరిసరాలతోపాటు జిల్లా కేంద్రం భువనగిరి అభివృద్ధికి మరింత దోహదపడనుంది. అయితే ఎంఎంటీఎస్‌ కోసం నిర్మించాల్సిన మూడో లైన్‌కు భూసేకరణే అత్యంత కీలకమవుతుందని పలువురు అంటున్నారు. అయితే ఈమార్గంలోని డబ్లింగ్‌ పట్టాల వెంట మూడో లైన్‌ నిర్మాణానికి సరిపడా రైల్వే స్థలం ఉందని, భూ సేకరణ అవసరం ఉండదని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా సర్వే పూర్తయ్యాకే పనులపై స్పష్టత రానుంది.

Updated Date - May 25 , 2025 | 12:25 AM