Share News

మహిళలకు స్కిల్‌డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయిస్తా

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:31 AM

మహిళలకు స్వయం ఉపాధి పథకాల కోర్సులపై శిక్షణ కల్పించేందుకు చౌటుప్పల్‌ పట్టణంలో ప్రత్యేకంగా శిక్షణ నైపుణ్య కేంద్రాన్ని(స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌) ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హామీఇచ్చారు.

మహిళలకు స్కిల్‌డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయిస్తా

చౌటుప్పల్‌ టౌన్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): మహిళలకు స్వయం ఉపాధి పథకాల కోర్సులపై శిక్షణ కల్పించేందుకు చౌటుప్పల్‌ పట్టణంలో ప్రత్యేకంగా శిక్షణ నైపుణ్య కేంద్రాన్ని(స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌) ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హామీఇచ్చారు. మదర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మునిసిపాలిటీతో పాటు రూరల్‌ మండలంలో కుట్టు శిక్షణ పొందిన 2 వేల మంది మహిళలకు చౌటుప్పల్‌లో సోమవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే సర్టిఫికెట్స్‌ను అందజేశారు. శిక్షణ కేంద్రానికి ప్రభుత్వం ఎకరం భూమిని కేటాయించడంతో పాటు అందులో అవసరమైన భవనాలను కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్‌ ద్వారా రూ.5 కోట్ల వరకు నిధులను వెచ్చించి నిర్మాణం చేయిస్తుందన్నారు. నియోజకవర్గంలోని 62 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 188 మంది విద్యార్థులకు రూ.21 లక్షల నగదును ప్రోత్సాహకంగా అందజేశామన్నారు. కష్టాల్లో ఉన్న పేద మహిళలకు అండగా ఉంటామన్నారు. మదర్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షురాలు బొజ్జ సంధ్యారెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో 11,300 మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చామని, అందులో 950 మంది ఒంటరి మహిళలు ఉన్నారన్నారు. కార్యక్రమంలో చౌటుప్పల్‌ ఏఎంసీ చైర్మన్‌ ఉబ్బు వెంకటయ్య, కాంగ్రెస్‌ మునుగోడు అసెంబ్లీ కో- ఆర్డీనేటర్‌ పబ్బు రాజుగౌడ్‌, మాజీ జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ ఆకుల ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్‌ డిల్లీ చంద్రకళ, సీతారామచంద్రస్వామి దేవాలయ చైర్మన్‌ బీ మురళి, కాంగ్రెస్‌ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు బోయ దేవేందర్‌, సుర్వి నర్సింహాగౌడ్‌, న్యాయవాది ఊడుగు శ్రీనివాస్‌, రమేష్‌, గుర్రం వెంకటేశం పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 12:31 AM