భువనగిరికి కొత్త రూపు
ABN , Publish Date - Jun 25 , 2025 | 12:11 AM
జిల్లా కేంద్రం భువనగిరి పట్టణం నూ తన సొబగులు సంతరించుకోనుంది. పట్టణ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన కు ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసింది.
రూ.13.60కోట్ల పనులకు టెండర్లు పూర్తి
త్వరలో మరో రూ.15కోట్లతో మరిన్ని పనులు
100 ఫీట్ల రహదారులు, ఐదు చౌరస్తాల సుందరీకరణ
భువనగిరి టౌన్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం భువనగిరి పట్టణం నూ తన సొబగులు సంతరించుకోనుంది. పట్టణ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పన కు ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేసింది. రూ.13.60కోట్ల హెచ్‌ఎండీఏ నిధు ల పనులకు టెండర్లు పూర్తికాగా, మరో రూ.15కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనుల ప్రతిపాదనలు చివరి దశలో ఉన్నాయి. దీంతో మొదటి దఫా పనులు ప్రారంభమైన వెంటనే రెండో దశ పనులు చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. దీంతో స్వల్ప వ్యవధిలో రూ.28.60కోట్ల హెచ్‌ఎండీఏ నిధులతో పట్టణ వ్యాప్తంగా అభివృద్ధి పనులు సాగనున్నాయి. రెండు దశలో ప్రతిపాదించిన పనులన్నీ పూర్తయితే పట్టణంలో విశాలమైన రహదారులు, ట్రాఫిక్ ఇక్కట్లు లేని చౌరస్తాలు అందుబాటులోకి వ స్తాయి. ప్రధాన రహదారి ఫుట్‌పాత్ టైల్స్ పనులతో పట్ణణానికి కొత్తరూపు రానుంది. అదేసమయంలో పలుబస్తీల్లో సీసీ, బీటీ రోడ్లు, మురుగు కాల్వల కష్టాలు తీరనున్నాయి.
మొదటి దశలో రూ.13.60కోట్లు...
పట్టణ వ్యాప్తంగా మొదటి దశలో రూ.13.60కోట్ల హెచ్‌ఎండీఏ నిధులతో 28 పనులు చేపడుతున్నారు. వీటిలో రూ.3,18,24,000తో పాత బస్టాండ్ నుంచి బైపాస్ రోడ్డు వరకు 1,800మీటర్ల హనుమాన్‌వాడ రహదారిని 100 ఫీట్ల రహదారిగా విస్తరించనున్నారు. రూ.1,58,47,000తో పట్టణ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న 4,284మీటర్ల ఫుట్‌పాత్‌పై టైల్స్ పనులు చేయనున్నారు. రూ.1,47,52,000తో 10వ, 26వ వార్డుల్లో విస్తరించి ఉన్న హౌసింగ్‌బోర్డు కాలనీలో 2,716 మీటర్ల మేర అండర్‌గ్రౌండ్ డ్రైనేజీని అభివృద్ధి చేయనున్నారు. రూ.కోటితో 8, 9, 35వ వార్డుల్లో మురుగు కాల్వల నిర్మాణం, రూ.81లక్షలతో తాతానగర్ వైకుంఠధామాన్ని అభివృద్ధి చేయనున్నారు. రూ.71లక్షలతో 9, 22, 25వ వార్డుల్లోని ప్రధాన మురుగు కాల్వను అండర్‌గ్రౌండ్ డ్రైనేజీగా అభివృద్ధి చేసి బహార్‌పేట్ రహదారిని విస్తరిస్తారు. రూ.68లక్షలతో 8వ వార్డులో ప్రధాన మురుగు కాల్వ నిర్మాణం రూ.60లక్షలతో అంబేడ్కర్ విగ్రహం నుంచి 19వ వార్డు వరకు మురుగు, వరద కాల్వలు, రూ.54 లక్షలతో ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్ వద్ద మురుగు కాల్వ, మరో రూ.2,99,25,000తో మరిన్ని వార్డుల్లో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
మలి దఫాలో రూ.15కోట్లతో
పట్టణంలో మొదటి దఫా రూ.13.60కోట్లతో పనులు ప్రారంభమైన వెంటనే రూ.15కోట్లతో మలి దఫా పనులు చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మలి దఫాలో వినాయకచౌరస్తా-నల్లగొండ చౌరస్తా వరకు, హైదరాబాద్ చౌరస్తా-నల్లగొండ చౌరస్తా వరకు, జగదేవ్‌పూర్-ఆర్‌వోబీ వరకు 100 ఫీట్ల రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద నల్లగొండ, హైదరాబాద్, జగదేవ్‌పూర్, పాత బస్టాండ్, వినాయకచౌరస్తాలను అభివృద్ధి చేసి సుందరీకరణ పనులు చేస్తారు. వినాయకచౌరస్తాలోని ప్రస్తుత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మరింత ముందుకు జరిపి విస్తరించనున్నారు. జంక్షన్లుగా అభివృద్ధి చేసే చౌరస్తాల్లో ఫౌంటెన్లు, ఆకట్టుకునే శిల్పాకృతులు, తదితర సుందరీకరణ పనులు, బస్తీల్లో మిగతా అభివృద్ధి పనులు చేపడతారు.
పట్టణ అభివృద్ధి లక్ష్యం: కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే
పట్టణ అభివృద్ధి లక్ష్యంగా రెండు దఫాలు రూ.28.60కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాము. దీంతో పట్టణంలో విశాలమైన రహదారులు అందుబాటులోకి వస్తాయి. హెచ్‌బీ కాలనీ తదితర బస్తీల్లో డ్రైనేజీ, రహదారుల సమస్యలు తీరతాయి. పట్టణ ప్రధాన రహదారి టైల్స్ పనులతో శాశ్వతంగా ఆక్రమణలు తొలగిస్తాం. త్వరలోనే ఇంటిగ్రేటెడ్ మార్కెట్, తుది దశకు చేరిన పట్టణ ప్రధాన రహదారి విద్యుత్ టవర్స్‌ను వినియోగంలోకి తెస్తాం. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు. త్వరలోనే పట్టణ శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలుచేస్తాం.