Share News

చెర్వుగట్టుపై వైభవంగా లక్ష పుష్పార్చన

ABN , Publish Date - Jul 25 , 2025 | 01:02 AM

నార్కట్‌పల్లి మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంపై గురువారం లక్ష పుష్పార్చన మహోత్సవం వైభవం గా జరిగింది.

చెర్వుగట్టుపై వైభవంగా లక్ష పుష్పార్చన
లక్షపుష్పార్చన వేడుకను నిర్వహిస్తున్న అర్చకులు

నార్కట్‌పల్లి, జూలై 24 (ఆంధ్రజ్యోతి): నార్కట్‌పల్లి మండలంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంపై గురువారం లక్ష పుష్పార్చన మహోత్సవం వైభవం గా జరిగింది. ఓ వైపు ముసురు పడుతున్నా అమావాస్య సందర్భంగా నిర్వహించే ఈ వేడుకకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వర్షంలో తడుస్తూనే మూడు గుండ్ల దర్శనానికి క్యూ కట్టారు. నిద్రించేందుకు స్థలం కొరతతో ఇబ్బంది పడ్డారు. కాగా గర్భాలయం నుంచి పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను సన్నాయి వాయిద్యాలు భక్తుల శివన్నామ స్మరణల మధ్య మహా మంటపానికి చేర్చారు. ఆలయ ఉప ప్రధానార్చకుడు సతీశ శర్మ సహార్చకులు సురేశ శర్మ, శ్రీకాంత శర్మ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య విశేషపుష్పాలతో ఉత్సవమూర్తులను అభిషేకించారు. స్వామి పాదాల చెంత పూజలనందుకున్న పుష్పాల కోసం భక్తులు పోటీపడ్డారు. స్వామి వారి పుష్కరిణిలో స్నానమాచరించి పార్వతీ జడల రామలింగేశ్వరునితో పాటు గుట్టపైన ఉన్న ఉపాలయాలు, గుట్ట కింద ఉన్న పార్వతీ అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. పాదరక్ష, కోడె మొక్కులను తీర్చుకున్నారు. ఈ వేడుకలో దేవస్థాన ఈవో సిరికొండ నవీన కుమార్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2025 | 01:02 AM