Share News

మోస్తరు వర్షానికే కూలిన మురికి కాల్వ

ABN , Publish Date - Jul 18 , 2025 | 12:32 AM

మోత్కూరు మునిసిపాలిటీలో ఇందిరానగర్‌ కాలనీ ఎదురుగా నార్కట్‌పల్లి రోడ్డు వెంట ఇటీవల కొత్తగా మురికి కాల్వ నిర్మించారు.

మోస్తరు వర్షానికే కూలిన మురికి కాల్వ
ఇందిరానగర్‌ కాలనీ ఎదురుగా కూలిన మురికి కాల్వ

నాణ్యతా లోపమే కారణమంటూ ప్రజల ఆగ్రహం

మోత్కూరు, జూలై 17 (ఆంధ్రజ్యోతి): మోత్కూరు మునిసిపాలిటీలో ఇందిరానగర్‌ కాలనీ ఎదురుగా నార్కట్‌పల్లి రోడ్డు వెంట ఇటీవల కొత్తగా మురికి కాల్వ నిర్మించారు. గురువారం మధ్యాహ్నం మోత్కూరులో కురిసిన ఓ మోస్తరు వర్షానికి ఆ కాల్వ ఒక వైపు (గోడ) సుమారు 80 మీటర్ల పొడవు కూలిపోయింది. ఒక వైపు (గోడ) కూలి రెండోవైపు ఉన్నదానిపై పడటంతో అదికూడా దెబ్బతిన్నదంటున్నారు. దీంతో మురికి కాల్వ నిర్మాణ నాణ్యతలోని డొల్ల తనం బయట పడినట్టయ్యింది. మురికి కాల్వల నిర్మాణం జరిగేప్పుడు సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులు పర్యవేక్షించడం లేదని, కాంట్రాక్టర్‌ తగు పాళ్లలో సిమెంటు కలపకుండా ఇష్టారాజ్యంగా నిర్మిస్తూ, క్యూరింగ్‌ సక్రమంగా చేయడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మురికి కాల్వ నిర్మాణం కోసం కొంత వెడల్పుగా గాతు తీస్తారని, కాల్వ నిర్మాణం జరిగాక కాల్వకు ఇరువైపులా గాతులో ఖాళీ స్థలాన్ని మట్టితో నింపుతారు. గురువారం కురిసిన వర్షానికి మట్టి తడిసి బరువు పెట్టినట్టు కావడంతో మురికి కాల్వ గోడ కూలిందంటున్నారు. ఓ మోస్తరు వర్షానికే ఒక వైపు కూలితే భారీ వర్షాలు కురిస్తే కొత్తగా నిర్మించిన మురికి కాల్వలు ఉంటాయా లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కూలిన మురికి కాల్వకు ఇప్పటికే బిల్లు చెల్లిస్తే కాంట్రాక్టర్‌ నుంచి రికవరీ చేయాలని, బిల్లు చెల్లించనట్టయితే అతని చేతనే తిరిగి నాణ్యతగా నిర్మింపజేయాలని పట్టణ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవడంతోనే..

మునిసిపల్‌ పాలక వర్గాన్ని, అధికారులను ఎంతో కాలం అడగ్గా, ఎదురు చూడగా ఇటీవల మోత్కూరు ఇందిరానగర్‌ కాలనీ ఎదురుగా కొత్తగా మురికి కాల్వ నిర్మించారు. ఇంకా అందులోంచి మురికి నీరు పారనేలేదు. గురువారం మధ్యాహ్నం కురిసిన తేలిక పాటి వర్షానికే ఒక వైపు పూర్తిగా కూలి రెండో వైపు గోడపై పడటంతో అదికూడా దెబ్బతిన్నది. మురికి కాల్వలు నాణ్యణా ప్రమాణాలు పాటించకుండా నిర్మించడంతో పాటు క్యూరింగ్‌ చేయడం లేదు. కాంట్రాక్టర్‌కు బిల్లు చెల్లించకుండా అతనితోనే పునర్నిర్మింప జేయాలి.

-దాసరి తిరుమలేష్‌, ఎస్సీ, ఎస్టీ విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ జిల్లా కమిటీ సభ్యుడు, మోత్కూరు

Updated Date - Jul 18 , 2025 | 12:32 AM