దసరాకు 705 బస్సులు
ABN , Publish Date - Sep 14 , 2025 | 12:24 AM
దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి 705 స్పెషల్ బస్ స ర్వీసులను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నల్లగొండ రీజియన్ రూపొందించిన నివేదికకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఆమోదం తెలిపారు.
ప్రత్యేక బస్ సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళిక
స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం
పండుగ తరువాత మరో మూడు రోజులు కూడా
డిమాండ్‌ను బట్టి ఆయా రూట్లలో అదనంగా..
(ఆంధ్రజ్యోతి,నల్లగొండ)తి: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల నుంచి 705 స్పెషల్ బస్ స ర్వీసులను నడపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు నల్లగొండ రీజియన్ రూపొందించిన నివేదికకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఆమోదం తెలిపారు.
దసరా సందర్భంగా ప్రత్యేక బస్ సర్వీసులను నడిపించేందుకు సంస్థ షెడ్యూల్‌ను రూపొందించింది. దసరా స్పెషల్ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతుంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం ఏడు డిపోల పరిఽధిలో 680 బస్సులు పలు రూట్ల ల్లో నిత్యం 2.60లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాయి. అందుకు సంస్థకు ప్రతీ రోజు రూ.1.50కోట్ల ఆదాయం సమకూరుతోంది. ప్రతీడిపో నుంచి హైదరాబాద్‌తో పాటు దూ ర ప్రాంతాలన్నింటికీ దసరా సందర్భంగా బస్సులు నడపనున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు ప్రజలను చేరవేయడం కోసం హైదరాబాద్‌కు ఎక్కువగా సర్వీసులు నడపనున్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి కొన్ని రూట్లలో ఎక్స్‌ప్రెస్ బస్సు లు ఉన్నాయి. వాటిలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగించనున్నారు. రీజియన్‌లో డిమాండ్‌ను బట్టి అదనపు బస్సులు పెంచనున్నారు. పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా వారి గమ్య స్థానాలకు చేర్చడంతోపాటు ప్రధానంగా పల్లెలకు గ్రామాలకు స్పెషల్ బస్సులు నడపనున్నారు.
డిపోల వారీగా బస్సుల సర్వీసులు ఇలా
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏడు డిపోలు ఉన్నాయి. ఈనెల 20 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు నడిపే బస్సుల వివరాలను ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఆ తరువాత మరో మూడు రోజుల పాటు ప్రత్యేక బస్సులను కొనసాగించనున్నారు. ప్రయాణికుల సంఖ్య అఽధికంగా ఉంటే అదనంగా మరో 30 నుంచి 50సర్వీసులను అప్పటికప్పుడే నడిపేలా ఏర్పాట్లు చేశారు. దేవరకొండ డిపో పరిధిలో 131 బస్సు సర్వీసులు, కోదాడ పరిధిలో 94 మిర్యాలగూడ డిపో పరిధిలో 115, నల్లగొండ డిపో పరిధిలో 89, నార్కట్‌పల్లి డిపో పరిధి లో 36, సూర్యాపేట పరిధిలో 144, యాదగిరిగుట్ట పరిధిలో 96 బస్ సర్వీసులను మొత్తంగా పండుగ రోజుల్లో దసరా స్పెషల్‌గా 705 బస్ సర్వీసులను ఆయా రూట్లల్లో తిప్పనున్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా ప్రతీ రూట్‌లోనూ అవసరమైన మేరకు బస్సులు నడపనున్నారు. అత్యధికంగా నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి జిల్లాలోని ఆయా డిపోల నుంచి హైదరాబాద్ నగరానికి బస్సులు అధిక సంఖ్యలో నడపనున్నారు.
20 నుంచి స్పెషల్ బస్సులు
ప్రభుత్వం పాఠశాలలకు ఈనెల 21 నుం చి అక్టోబరు 3వ తేదీ వరకు దసరా సెలవుల ను ప్రకటించింది. అదేవిధంగా కళాశాలలకు ఈనెల 28 నుంచి అక్టోబరు 5వ తేదీ వరకు సెలవులు ఇచ్చింది. బతుకమ్మ పండుగ ఈ నెల 21న ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు కొనసాగి 30వ తేదీన సద్దుల బతుకమ్మతో ముగియనుంది. బతుకమ్మ, దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు, దసరా నేపథ్యంలో ఈనెల 20వ తేదీ నుంచే ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనుంది. ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేయడంతో పాటు ఆదాయం కూడా సమకూర్చుకునేందుకు పండుగకు ముందస్తుగానే బస్సు సర్వీసులు నడిపేందుకు నిర్ణయించింది. దసరా సెలవుల్లో పట్టణ ప్రాంతాల నుంచి అధికంగా పల్లెలకు వెళ్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్టోబరు 2వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు రీజియన్ పరిధిలోని అన్ని డిపోల నుంచి స్పెషల్ బస్సులు నడిపిస్తారు. అదేవిధంగా గ్రామాలకు వెళ్లిన వారు పండుగ తరువాత 3, 4, 5 తేదీల్లో పట్టణాలకు తిరుగుముఖం పడతారు. ఈ రోజుల్లో కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులను ఎంచుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. అదేవిధంగా మహిళలకు ఉచిత ప్రయాణంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రీయింబర్స్‌మెంట్ వస్తున్న నేపథ్యంలో సంస్థ మహిళా ప్రయాణికుల కోసం పెద్ద సంఖ్యలో బస్సులు నడపనుంది.
మెరుగైన ప్రయాణమే లక్ష్యం : కె.జానిరెడ్డి, నల్లగొండ ఆర్టీసీ ఆర్‌ఎం
దసరా పండుగ సందర్భంగా రీజియన్ పరిధి లో ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడపనుంది. మొత్తం 705 స్పెషల్ బస్సు సర్వీసులు ఈనెల 20 నుంచి నడుస్తాయి. ప్రయాణికులకు మెరుగైన ప్రయాణమే లక్ష్యంగా వీటిని నడుపుతాం.