ఎకరాకు రూ.40లక్షలు ఇవ్వాలి
ABN , Publish Date - May 18 , 2025 | 12:14 AM
రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులందరికీ ఎకరాకు రూ.40లక్షల చొప్పున ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
గంధమల్ల రిజర్వాయర్ నిర్వాసిత రైతుల డిమాండ్
ప్రస్తుత మార్కెట్ ధరకు మూడు రెట్లు ఇస్తామంటున్న అధికారులు
తుర్కపల్లి, మే 17 (ఆంధ్రజ్యోతి): రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులందరికీ ఎకరాకు రూ.40లక్షల చొప్పున ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి భూ సేకరణపై శనివారం తహసీల్దార్ కార్యాలయంలో భువనగిరి ఆర్డీవో కే.కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులతో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. గంధమల్లలో 1.41 టీఎంసీల సామర్థ్యంతో ప్రభుత్వం రిజర్వాయర్‌ను నిర్మిస్తుందన్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం 2500 రైతుల నుంచి ఎకరాలు 998.38 గుంటల భూమిని సేకరిస్తుందని అధికారులు తెలిపారు. ఈ సమావేశానికి గ్రామంనుంచి సుమారు 50మంది రైతులు హాజరయ్యారు. గ్రామానికి నష్టం జరగకుండా చూడాలని అధికారులను కోరారు. తాము ఎన్నో ఏళ్లుగా ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నామని, ప్రభుత్వం రిజర్వాయర్ నిర్మాణంకోసం తీసుకుంటే తామంతా ఉపాధి కోల్పోతున్నామన్నా రు. భూములు పోతే మళ్లీ కొనుగోలు చేసే పరిస్థితిలో లేమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, భూములు కోల్పోతున్న ప్రతీ రైతుకు ఎకరాకు రూ.40లక్షలు ఇవ్వాలని రైతులంతా ముక్త కంఠంతో సమావేశంలో తేల్చి చెప్పారు. ప్రభుత్వం మాత్రం ప్రస్తుత మార్కెట్ ధరకు మూడు రెట్లు ఇస్తుందని అధికారులు తెలిపారు. రైతుల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు తెలిపారు. సమావేశంలో భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, తహసీల్దార్ డి.దేశ్యానాయక్, ఇరిగేషన్ ఏఈ రాంపతి, రైతులు పాల్గొన్నారు.