Share News

ఈ నెల 30 దాటితే 2శాతం అపరాధ రుసుము

ABN , Publish Date - Jun 08 , 2025 | 12:01 AM

పట్టణాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను డిమాండ్‌ నోటీసుల జారీని మునిసిపాలిటీలు ప్రారంభించాయి. వార్డ్‌ ఆఫీసర్లు, బిల్‌ కలెక్టర్లు తమకు కేటాయించిన అసె్‌సమెంట్‌ భవనాల యజమానులకు ఆస్తి పన్ను డిమాండ్‌ నోటీసులను పంపిణీ చేస్తున్నారు.

ఈ నెల 30 దాటితే 2శాతం అపరాధ రుసుము

ఆస్తిపన్ను డిమాండ్‌ నోటీసుల జారీ

భువనగిరి టౌన్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): పట్టణాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను డిమాండ్‌ నోటీసుల జారీని మునిసిపాలిటీలు ప్రారంభించాయి. వార్డ్‌ ఆఫీసర్లు, బిల్‌ కలెక్టర్లు తమకు కేటాయించిన అసె్‌సమెంట్‌ భవనాల యజమానులకు ఆస్తి పన్ను డిమాండ్‌ నోటీసులను పంపిణీ చేస్తున్నారు. చెల్లించాల్సిన పన్ను, చెల్లింపు గడువు తదితర వివరాలను డిమాండ్‌ నోటీసులో పేర్కొంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో శతశాతం పన్ను వసూలు లక్ష్యంగా మునిసిపల్‌ యంత్రాంగాలు ఇప్పటినుంచే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. గతంతో పోలిస్తే వార్డు అధికారుల పేరిట ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఆస్తిపన్ను వసూలు కేడా అదే స్థాయులో పెరుగుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను చెల్లింపు గడువు ఈ నెల 30. గడువు దాటితే రెండు శాతం అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంటుంది. బకాయి ఆస్తిపన్ను గడువులోగా చెల్లిస్తే పాత జరిమానా మాత్రమే వర్తిస్తుంది. జూన్‌ 30 దాటితే పాత జరిమానాతోపాటు నూతన జరిమానాతో కలిపి ఆస్తిపన్ను చెల్లించాల్సి ఉంటుంది. అన్ని మునిసిపాలిటీలకు ఇదే విధానం వర్తిస్తుంది.

భువనగిరి మునిసిపాలిటీలో..

భువనగిరి మునిసిపల్‌ పరిధిలోని 35 వార్డులలో 15,381 అసెస్మెంట్‌ ఉన్నాయి. వీటి ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.5,54,26,000, బకాయిలు రూ. 3,79,44,000 మొత్తం రూ.9,33,70,000 ఆస్తిపన్ను డిమాండ్‌ ఉంది. ఏప్రిల్‌ ఒకటి నుంచి 30 వరకు ఐదు శాతం రాయితీతో 2,400 అసెస్మెంట్‌ యజమానులు రూ.1,55,87,000 ఆస్తిపన్ను చెల్లించారు. రాయితీ గడువు ముగిసినప్పటి నుంచి నేటి వరకు సుమారు 100 అసెస్మెంట్‌ నుంచి సుమారు రూ.10లక్షల ఆస్తిపన్నును మునిసిపల్‌, రెవెన్యూ సిబ్బంది వసూలు చేశారు. దీంతో మునిసిపాలిటీకి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంకా 12,781 అసెస్మెంట్‌ నుంచి రూ.7,67,83,000 ఆస్తిపన్ను రావాల్సి ఉంది. మునిసిపల్‌ శాఖ నిర్ధేశించిన ఈ నెల 30లోపు ఆస్తిపన్ను చెల్లించని పక్షంలో రెండుశాతం అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంటుంది.

గడువులోపు చెల్లించాలి : జి.రామలింగం, కమిషనర్‌, భువనగిరి మునిసిపాలిటీ

జూన్‌ 30లోపు ఆస్తిపన్ను చెల్లించి రెండు శాతం జరిమానా మినహాయింపు పొందాలి. సకాలంలో పన్ను చెల్లిస్తే పట్టణాభివృద్ధికి సహకరించినట్టే, మునిసిపల్‌ సిబ్బందికి నేరుగా చెల్లిస్తే తప్పనిసరిగా రశీదు పొందాలి. సకాలంలో పన్ను చెల్లించి మిగతా వారికి ఆదర్శంగా ఉండాలి.

Updated Date - Jun 08 , 2025 | 12:01 AM