Share News

15 ఏళ్లుగా విధులు.. రూ.13 వేలే వేతనం

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:09 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పలు బ్యాంకుల తరపున విధులు నిర్వహిస్తున్న అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది చాలీచాలని వేతనంతో ఇబ్బందులు పడుతున్నారు.

15 ఏళ్లుగా విధులు.. రూ.13 వేలే వేతనం
ప్రసాద కౌంటర్లలో విధుల్లో నిమగ్నమైన బ్యాంకు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది

భారంగా అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి కుటుంబ పోషణ

యాదగిరిగుట్ట, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పలు బ్యాంకుల తరపున విధులు నిర్వహిస్తున్న అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది చాలీచాలని వేతనంతో ఇబ్బందులు పడుతున్నారు. యాదగిరిగుట్ట దేవస్థానానికి చెందిన 17 విభాగాలతో పాటు సెంట్రల్‌ బ్యాంకు ఇండియా(సీబీఐ), యూనియన బ్యాంకు ఇండియా(యూబీఐ), తెలంగాణ గ్రామీణ బ్యాంకు (టీజీజీబీ), స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) బ్యాంకులతో కూడా సేవలు అందిస్తున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో నాలుగు విభాగాల్లో 27 మంది అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. సీబీఐ బ్యాంకు ప్రసాదాల విభాగంలో 13 మంది, సువర్ణపుష్పార్చన విభాగం ముగ్గురు, యూబీఐ, టీజీజీబీలకు చెందిన 8మంది సిబ్బంది ప్రధాన బుకింగ్‌, ఎస్బీఐ తరపున అద్దె గదుల విభాగంలో ముగ్గురు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి చాలీచాలని వేతనమే ప్రధాన సమస్యగా మారింది. 15 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నా సిబ్బందికి మాత్రం రూ.13వేలకు మించలేదు. కొన్ని బ్యాంకులు రూ.7వేలే వేతనం ఇస్తున్నాయి. వీటితో సిబ్బంది కుటుంబపోషణకు చేయలేక ఆర్థికభారంతో ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలతో పోటీ పడలేక ఆర్థికంగా చితికిపోతున్నారు. వేతనం పెంచాలని బ్యాంకు మేనేజర్లను సంప్రదిస్తే పైనుంచి ఆమోదం రాలేదని చెబుతున్నట్లు సిబ్బంది తెలిపారు.

Updated Date - Oct 25 , 2025 | 12:09 AM