10,863 ఒకటో తరగతిలో చేరికలు
ABN , Publish Date - Jun 26 , 2025 | 12:10 AM
నూతన విద్యా సంవత్సరం 2025-26లో విద్యార్థుల సంఖ్యను పెంచి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకు ఈనెల 6 నుం చి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించింది.
ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు తరలిన విద్యార్థులు 8,229మంది
ఈనెల 6 నుంచి 19వరకు బడిబాట నిర్వహణ
అనుకున్న లక్ష్యం నెరవేరని వైనం
(ఆంధ్రజ్యోతి,కోదాడ): నూతన విద్యా సంవత్సరం 2025-26లో విద్యార్థుల సంఖ్యను పెంచి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకు ఈనెల 6 నుం చి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించింది. అందులో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని, ఉచితంగా పలు వసతులు ఉన్నాయని ప్రచారం నిర్వహించారు. అయితే అడ్మిషన్ల సంఖ్యను బట్టి ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరలేదని విద్యా నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతిలో 10,863 మంది విద్యార్థులు చేరారు. 2 నుంచి 10వ తరగతి వరకు ప్రైవే ట్ పాఠశాలల నుంచి 8,229 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. మొ త్తంగా 1 నుంచి 10వ తరగతి వరకు 19,09 2మంది విద్యార్థులు, ఈ విద్యా సంవత్సరం లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. అదే విధంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఐదో తరగతి పూర్తి చేసి 6వ తరగతిలోకి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7వ తరగతి పూర్తిచేసి, 8వ తరగతిలోకి ప్రవేశించిన విద్యార్థులు మరో 9,216 మంది వరకు ఉన్నారు. బడిబాటతో విస్తృత ప్రచారం చేసినా తల్లిదండ్రులు ప్రైవేట్ బాటనే పట్టడంపై ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా ప్రభుత్వమే ఉచిత విద్య, నాణ్యమైన భోజనం, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా, తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావడంలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రభుత్వం విద్యపై పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని, ప్రైవేట్ పాఠశాలలకు కళ్లెం వేసినప్పుడే ప్రభుత్వ పాఠశాలల మనుగడ సాధ్యమని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో 3,276 పాఠశాలలు
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 2,355, ప్రాథమికోన్నత 290, ఉన్నత పాఠశాలలు 631వరకు ఉన్నాయు. ఈ విద్యా సంవత్సరంలో సూర్యాపేట జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో ఒకటో తరగతిలో 2,596 మంది నూతనంగా ప్రవేశం పొందారు. 2 నుంచి 10వ తరగతిలో ప్రైవేట్ నుంచి 2,358 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. నల్లగొండ జిల్లాలోని పీఎ్‌సలలో ఒకటిలో 5,731 మంది చేరగా, 2 నుంచి 10వ తరగతిలో 2,976మంది, యాదాద్రి జిల్లాలోని పీఎ్‌సలలో ఒకటిలో 2,536మంది, 2 నుంచి 10వ తరగతిలో 2,895 మంది విద్యార్థులు చేరారు. మొత్తంగా 19,092 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. అదే విధంగా సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ పీఎ్‌సలలో ఐదు పూర్తి చేసి ఆరు, ఏడు పూర్తిచేసి ఎనిమిదిలోకి ప్రవేశించిన విద్యార్థులు 2,842 మంది కాగా, నల్లగొండలో 3,575 మంది, యాదాద్రి జిల్లాలో 3,374 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా ఒకటిలో విద్యార్థుల చేరికలు తగ్గినా, ప్రైవేట్ నుంచి ప్రభుత్వ యూపీఎస్, ఉన్నత పాఠశాలలకు తరలిన విద్యార్థులు సంఖ్య పెరగడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.