శతశాతం అక్షరాస్యత లక్ష్యం
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:39 AM
దేశంలో సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం గా అడుగులు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు 2047 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా వచ్చే ఐదేళ్లపాటు అమలు చేయనున్న న్యూ ఇండియా లిటరసీ (ఎన్‌ఐఎల్‌పీ) 2022-2027లో భాగంగా తొలి దశ కార్యాచరణ ప్రారంభమైంది.
తొలుత సమభావన సంఘాల మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు
ఎన్‌ఐఎల్‌పీలో భాగంగా కార్యక్రమాలు
ఓపెన్ స్కూల్ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్
(ఆంధ్రజ్యోతి,భువనగిరి టౌన్): దేశంలో సంపూర్ణ అక్షరాస్యత లక్ష్యం గా అడుగులు ప్రారంభమయ్యాయి. స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు 2047 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించడం ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా వచ్చే ఐదేళ్లపాటు అమలు చేయనున్న న్యూ ఇండియా లిటరసీ (ఎన్‌ఐఎల్‌పీ) 2022-2027లో భాగంగా తొలి దశ కార్యాచరణ ప్రారంభమైంది. సమభావన సంఘాల్లో ని నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, పలు కారణాలతో చదువును మధ్యలోనే నిలిపిన మహిళలను ఓపెన్ స్కూల్‌లో చేర్పించి పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేయించాలన్నది లక్ష్యం.
జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబరు 5న ఈ కార్యక్రమానికి క్షేత్రస్థాయిలో శ్రీకారం చుట్టనున్నారు. అందుకోసం ఇప్పటి కే అర్హులు, వలంటీర్స్, శిక్షణ, పుస్తకాల సరఫరా పూర్తయింది. వ యోజన విద్యాశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యాశాఖ సం యుక్తంగా పనిచేయనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏడాదిలో సుమా రు 1.29లక్షల మంది మహిళలు అక్షరాస్యులు కానున్నారు.
2047నాటికి సంపూర్తణ అక్షరాస్యత లక్ష్యం
శతశాతం అక్షరాస్యత 2047 నాటికి సాధించడం వికసిత్ భారత్ లక్ష్యం. ఈ మేరకు ఐదేళ్లపాటు అమలు చేయనున్న ప్రణాళిక లో మొదటి దశలో సమభావన సంఘాల్లోని నిరక్షరాస్య మహిళల ను అక్షరాసులుగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రభుత్వం సంకల్పించింది. సమభావన సంఘాల సభ్యులు చైతన్యవంతంగా ఉండటం, కుటుంబంతో పాటు సమాజంలో ప్రభావితం చూపే సామర్థ్యం ఉండటం, బ్యాంకు లింకేజీ రుణాలతో వారి పరిధిలో ఆర్థిక వ్యవహారాలు నడుపుతుండటం తదితర కారణాలతో ఎన్‌ఐఎల్‌పీ మొ దటి దశకు ఎంపిక చేశారు. అంతేగాక పాఠశాల విద్యను మధ్యలో నే నిలిపిన మహిళా సంఘాల సభ్యులను ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో చేర్పించి పూర్తి చేయించనున్నారు. మహిళా సంఘాల రుణాలు, చెల్లింపులు ఆన్‌లైన్‌లోనే జరుగుతుండటం, వారి సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వాలు ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తుండగా రానున్న కాలంలో మరిన్ని పథకాలు ప్రవేశపెట్టనున్నారు. దీంతో వారి పనులను వారే చేసుకోవ డం, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంపొందించుకొని ఆపాదించుకోవడం, అన్నింటికీ మించి అక్షరాస్యత, విద్యార్హతలతో వారిలో నూన్యత భావం తొలగి ఆత్మవిశ్వాసం పెరిగి మరింత సాధికారత సాధించగలుగుతారని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి దశకు ఎంపికైన ఉమ్మడి జిల్లాలోని మహిళా సంఘాల్లోని నిరక్షరాస్య మహిళల గుర్తింపు పూర్తి కాగా, ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు అర్హుల గుర్తింపు సాగుతోంది.
ఉల్లాస్ యాప్‌లో నమోదు
ఎన్‌ఐఎల్‌పీ మొదటి దశకు గుర్తించిన ఉమ్మడి జిల్లాలోని 1.29 లక్షల మంది నిరక్షరాస్య మహిళల వివరాలను ఉల్లా్‌స-నవభారత్ సాక్షరత కార్యక్రమం యాప్‌లో నమోదు చేశారు. అయితే అక్షరాస్యతపై ఆసక్తి కలిగిన సమభావన సంఘాల సభ్యులు గానీ మహి ళలు, పురుష నిరక్షరాసులు కూడా చేరవచ్చు. ఈ మేరకు గ్రామం లేదా బస్తీ యూనిట్‌గా 10మందికి ఒక వాలంటీర్‌ను నియమిస్తున్నారు. విశ్రాంత ఉద్యోగులు, యువకులు, సామాజిక కార్యకర్తలు, ఇతర ఔత్సాహికులను వాలంటీర్స్‌గా గుర్తించారు. వీరికి ఎలాంటి పారితోషికం, గౌరవ భృతి ఉండదు. స్వచ్ఛందంగా మాత్రమే పాల్గొనాలి. ప్రతీ రోజు గంట పాటు వీరిని ఒకే చోట చేర్చి నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతారు. ఏడాది పాటు సాగే మొదటి దశలో తెలుగు చదవడం, చూసి రాయడం, డిక్టేషన్ రాయడం, సంతకం, కనీస లెక్కలు చేసేలా నేర్పుతారు. అందుకోసం సెంటర్ వారీగా పుస్తకాలు, అవసరమైన విద్యాసామ గ్రి అందించనున్నారు. అలాగే పలు కారణాలతో చదువును మానేసిన మహిళలను వారి అర్హతల ఆధారంగా ఓపెన్ స్కూల్స్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో చేర్పిస్తారు. ప్రతీ మండలంలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్ స్కూల్స్ నిర్వహిస్తారు. సంవత్సరానికి 30 తరగతులు సెలవు రోజుల్లో నిర్వహిస్తారు. కనీసం 20 తరగతులకు తప్పనిసరిగా హాజరు కావల్సి ఉంటుంది. పదో తరగతి, సైన్స్ నాన్ సైన్స్ గ్రూపులుగా ఉండే ఇంటర్మీడియట్ ఒకే సంవత్సరంలో పూర్తవుతాయి. 14 ఏళ్లు నిండిన వారు పదో తరగతికి, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఇంటర్‌కు అర్హులు. అయితే రెగ్యులర్ ఇంటర్‌లో ఫెయిల్ అయిన అభ్యర్థులు ఓపెన్ స్కూల్ ఇంటర్‌లో ఆ సబ్జెక్టులను మాత్రమే చదివి పాసయ్యే సౌలభ్యం ఉంది. లేదా నచ్చిన ఐదు సబ్జెక్టులతో కోర్సును పూర్తి చేయవచ్చు. ఆసక్తి ఉన్న ఇతరులు కూడా నేరుగా లేదా ఆన్‌లైన్‌లో అడ్మిషన్ పొందవచ్చు. పదో తరగతికి రూ.1150, ఇంటర్‌కు రూ.1500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లాలో ఇప్పటివరకు సుమారు 400 మందిని ఓపెన్ స్కూల్‌కు అర్హులుగా గుర్తించి పేర్లు నమోదు చేశారు.
ఉమ్మడి జిల్లాలో..: ఉమ్మడి జిల్లాలో సుమారు 58,169 మహిళా సమభావన సంఘా లు ఉండగా, 5,13,422 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరిలో మొదటి దశ ఎన్‌ఐఎల్‌ిపీకి 1,29,874 మందిని గుర్తించగా ఉల్లాస్ యాప్‌లో నేటి వరకు 1,14,682 మంది ని నమోదు చేశారు. ఓపెన్ స్కూల్‌లో ప్రవేశాలకు లక్ష్యం జిల్లాలో 1,281 మందికి 442 మంది, సూర్యాపేట జిల్లాలో 4,400కి 380 మంది, నల్లగొండ జిల్లాలో 6,451 మందికి 380మంది పేరు నమోదు చేసుకున్నారు. కాగా, 2011 జనాభా లెక్కల ప్రకారం యాదా ద్రి, సూర్యాపేట జిల్లాల్లో 75శాతం చొప్పున, నల్లగొండ జిల్లాలో 63.85 శాతం అక్షరాస్యత ఉంది.
మహిళలందరినీ అక్షరాస్యులు చేస్తాం : నాగిరెడ్డి, డీఆర్‌డీవో
ఎన్‌ఐఎల్‌పీలో నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులు చేస్తాం. మొదటి దశలో సమభావన సంఘాల్లోని నిరక్షరాస్య మహిళలను గుర్తించి ఉల్లాస్ యాప్‌లో నమోదు చేశాం. వాలంటీర్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఓపెన్ స్కూల్‌లో చేరు మహిళల ఫీజులను సమభావన సంఘాల లాభాల నుంచి చెల్లించాలని సూచించాం. ఎన్‌ఐఎల్‌పీ మిగతా నాలుగు దశల్లో అన్ని రంగాల స్త్రీ, పురుషులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతాం. వయోభేదం లేకుండా అందరూ భాగస్వాములు కావాలి. అక్షరాస్యులు వాలంటీర్లుగా స్వచ్ఛందంగా సేవలు అందించాలి.
సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తాం : వి.నరసింహారెడ్డి, వయోజనవిద్య ఏపీవో
జిల్లాలో శతశాతం అక్షరాస్యత సాధిస్తాం. అదే ఎన్‌ఐఎల్‌పీ ఉద్దేశం. వయోభేదం లేకుండా అందరూ భాగస్వాములు కావాలి. మొత్తం ఐదు దశల్లో కార్యక్రమాన్ని అమలుచేస్తున్నాం. వలంటీర్లను నియమిస్తున్నాం.
ఓపెన్ స్కూల్స్ గుర్తించాం :కె.సత్యనారాయణ, డీఈవో
జిల్లాలో ఓపెన్ స్కూల్ సెంటర్స్‌ను గుర్తించాం. 18 కేంద్రాలకు 13 కేంద్రాల గుర్తింపు పూర్తయింది. త్వరలో మిగతా ఐదు కేంద్రాలను గుర్తిస్తాం. ఓపెన్ స్కూల్ టీచర్స్‌కు శిక్షణ ఇచ్చాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే ప్రారంభిస్తాం. ఆసక్తిగల అర్హులు సద్వినియోగం చేసుకోవాలి.