N Ramchander Rao: బీసీ రిజర్వేషన్లపై నాటకమాడుతున్న కాంగ్రెస్
ABN , Publish Date - Aug 05 , 2025 | 03:59 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం నాటకమాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మండిపాటు
హైదరాబాద్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం నాటకమాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు మండిపడ్డారు. ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం ఇష్టం లేదు గనుకే ఢిల్లీ వెళ్లి డ్రామా చేస్తోందని ఆరోపించారు. సోమవారం రాంచందర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తే తాము మద్దతిస్తామని ప్రకటించారు.
ముస్లింలకు ప్రతిపాదించిన 10శాతం రిజర్వేషన్లు తొలగించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్సు కాపీని రాష్ట్రపతికి కాంగ్రెస్‌నేతలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆ కాపీ పంపించాల్సింది గవర్నర్ కాదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. 10శాతం ముస్లిం రిజర్వేషన్లను ఎందుకు తొలగించరని ప్రశ్నిస్తే సమాధానం చెప్పని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రాన్ని బద్నాం చేస్తోందని ఆయన ఆరోపించారు.