Zilla Parishad Panchayat: సహోద్యోగి నుంచి లంచం డిమాండ్
ABN , Publish Date - May 07 , 2025 | 04:38 AM
మెడికల్ లీవ్ సెటిల్‌మెంట్ కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ములుగు జడ్పీ ఉద్యోగులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. లంచం మొత్తం రూ.60 వేలు కోరగా, రూ.25 వేలు తీసుకునే సమయంలో అరెస్టయ్యారు.

రూ.25 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఇద్దరు ములుగు జడ్పీ ఉద్యోగులు
ములుగు, మే 6 (ఆంధ్రజ్యోతి): ములుగు జడ్పీ సీఈఓ కార్యాలయం లో సహోద్యోగిగా పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ మెడికల్ లీవ్ సెటిల్‌మెంట్‌కూ లంచం డిమాండ్ చేసిన ఇద్దరు జడ్పీ ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. జడ్పీ సీఈఓ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నేరళ్లపల్లి వెంకటేశ్వర్లు.. 2023-24లో అనారోగ్యంతో పలుమార్లు మెడికల్ లీవ్ పెట్టారు. గత జనవరి నుంచి రెగ్యులర్‌గా విధులకు హాజరవుతున్న వెంకటేశ్వర్లు.. తన మెడికల్ లీవ్స్ సెటిల్‌మెంట్ రికార్డును ట్రెజరీకి పంపాలని జడ్పీ సూపరింటెండెంట్ గాధగోని సుధాకర్, ఎస్టాబ్లి్‌షమెంట్ సెక్షన్ జూనియర్ అసిస్టెంట్ సౌమ్యారెడ్డిలను కోరారు. అందుకు రూ.60 వేలు ఇవ్వాలని సుధాకర్, సౌమ్యారెడ్డి డిమాండ్ చేశారు. తొలుత రూ.25 వేలు ఇచ్చి.. మిగతా సొమ్ము బిల్లులు క్రెడిట్ అయ్యాక ఇవ్వాలని ప్రతిపాదించారు. దీంతో వెంకటేశ్వర్లు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం సుధాకర్, సౌమ్యారెడ్డి అడిగిన రూ.25 వేల నగదు ఇవ్వడానికి ఆఫీసుకెళ్లాడు. సౌమ్యారెడ్డి సూచన మేరకు ఆ డబ్బును సుధాకర్‌కు ఇస్తుండగా.. సుధాకర్, సౌమ్యారెడ్డిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు.