Share News

తల్లుల నిరీక్షణ

ABN , Publish Date - Feb 19 , 2025 | 01:22 AM

తల్లులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచే దిశగా గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి పథకం లక్ష్యం కొంతమేరకు నేరవేరినా గర్భిణులు, బాలింతలకు అందించే ప్రోత్సాహకానికి ఎదురుచూడక తప్పడం లేదు.

తల్లుల నిరీక్షణ

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

తల్లులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచే దిశగా గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేసీఆర్‌ కిట్‌, అమ్మఒడి పథకం లక్ష్యం కొంతమేరకు నేరవేరినా గర్భిణులు, బాలింతలకు అందించే ప్రోత్సాహకానికి ఎదురుచూడక తప్పడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత అమ్మఒడి పథకం పేరును మదర్‌ చైల్డ్‌ హెల్త్‌గా మార్చినా డబ్బులు మాత్రం అందడం లేదు. మాతా శిశు మరణాలు తగ్గించడం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచేందుకు దోహదపడుతున్న నగదు ప్రోత్సాహకానికి నిరీక్షణ తప్పడం లేదు. నాలుగు విడతలుగా అందించే ప్రోత్సాహకానికి దాదాపు మూడేళ్లుగా ఎదురుచూపులకే పరిమితం అయ్యింది. 2017లో ప్రారంభమైన అమ్మఒడి పథకాన్ని మదర్‌ చైల్డ్‌ హెల్త్‌గా కాంగ్రెస్‌ ప్రభుత్వం కొనసాగిస్తున్నా ప్రోత్సాహక బకాయిలు అందకపోవడంతో నిరాశ చెందుతున్నారు.

ఫ జిల్లాలో రూ 17.03 కోట్ల బకాయిలు...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మదర్‌ చైల్డ్‌ హెల్త్‌ పథకానికి సంబంధించిన ప్రోత్సాహక బకాయిలు రూ. 17.03 కోట్ల వరకు ఉన్నాయి. బకాయిల కోసం జిల్లాలో 16,094 మంది గర్భిణులు, బాలింతలు ఎదురుచూస్తున్నారు. మదర్‌ చైల్డ్‌ హెల్త్‌ స్కీంలో గర్భం దాల్చిన తరువాత మొదటి విడతలో ప్రసవాల సమయంలో రూ3 వేలు అందిస్తారు. రెండో విడతలో మగబిడ్డ పుడితే రూ 4 వేలు, ఆడబిడ్డ పుడితే రూ 5 వేలు, మూడో విడతలో ఇమ్యూనైజేషన్‌ సమయంలో రూ 2 వేలు, చివరి ఇమ్యూనైజేషన్‌ నాలుగో విడతలో రూ 3 వేలు తల్లి ఖాతాల్లో జమ చేస్తారు. జిల్లాలో పథకం ప్రారంభమైన తరువాత వివిధ సేవలకు సంబంధించిన ప్రోత్సాహకాల్లో గర్భిణులలో 20,381 మంది, ప్రసూతి అయినవారు 10,017 మంది, మొదటి టీకాలు తీసుకున్నావారు 19,868 మంది, చివరి టీకాలు తీసుకున్నావారు 17,273 మంది లబ్ధి పొందారు. పోత్సాహకం కోసం ఎదురుచూస్తున్న బకాయిలు రూ 17కోట్ల 3 లక్షల 99 వేలు ఉన్నాయి. ఇందులో గర్భిణులకు సంబంధించి 13,992 మందికి రూ 4,19,76,000, ప్రసూతి అయిన వారిలో 10,406 మంది రూ 4,68,27,000, మొదటి ఇమ్యూనైజేషన్‌కు సంబంధించి 16,657 మందికి రూ 3,33,14,000, చివరి ఇమ్యూనైజేషన్‌కు సంబంధించి 16,094 మందికి రూ 4,82,82,000 బకాయిలు రావాల్సి ఉంది. వీటి కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

Updated Date - Feb 19 , 2025 | 01:22 AM