Share News

మోగిన నగారా

ABN , Publish Date - Jan 30 , 2025 | 01:28 AM

పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలు, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, ఎ నర్సిరెడ్డి పదవీకాలం మార్చి 29తో ముగియనున్నది.

 మోగిన నగారా

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటించింది. కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలు, ఖమ్మం, వరంగల్‌, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, ఎ నర్సిరెడ్డి పదవీకాలం మార్చి 29తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ ఆయా స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కానున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 10 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 11న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. 13న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. మార్చి 3న కౌంటింగ్‌ ప్రారంభించి పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. మార్చి 8వ తేదీతో ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది. బుధవారం షెడ్యూల్‌ ప్రకటించడంతో జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది.

ఫ పట్టభద్రుల స్థానంలో 3,41,313 ఓట్లు, టీచర్ల స్థానంలో 25,921 ఓటర్లు:

కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ పట్టభద్రుల స్థానంలో కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్‌ , సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలు, హన్మకొండ, జయశంకర్‌ భూపాలపల్లిలోని కొన్ని మండలాలకు చెందిన పట్టభద్రులు ఓటర్లుగా ఉన్నారు. 2024 డిసెంబరు 30 నాటికి ఈ నియోజకవర్గంలో 3,41,313 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో 2,18,060 మంది పురుషులు, 1,23,250 మంది స్త్రీలు, ముగ్గురు థర్డ్‌జెండర్‌కు చెందినవారున్నారు. జనవరి 29వరకు 11,056 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ మార్చి 3న ప్రారంభం కానుండటంతో ఫిబ్రవరి 2వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకునే అవకాశమున్నది. ఫిబ్రవరి 3న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 25,921 మంది గత డిసెంబరు 30 నాటికి ఓటర్లుగా నమోదయ్యారు. వీరిలో 16,364 మంది పురుషులు కాగా, 9,557 మంది స్త్రీలు ఉన్నారు. జనవరి 29 వరకు 2,148 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఫ ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలుచేయాలి

- కలెక్టర్‌ పమేలా సత్పతి

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆమె జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ నాయకులకు సంబంధించిన ఫొటోలు, ప్రకటనలకు సంబందించిన ఫోస్టర్లు, బ్యానర్లను తొలగించాలన్నారు. బస్టాండ్‌, పబ్లిక్‌ ప్లేస్‌లలో ఉన్న హోర్డింగ్‌లు, బ్యానర్లు, స్టిక్కర్లు తీసివేయాలని ఆదేశించారు. ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసే గోడ రాతలను చెరిపివేయాలని, దేశ, రాష్ట్ర, స్థానిక రాజకీయనాయకులకు సంబంధించిన విగ్రహాలకు ముసుగులు వేయాలని సూచించారు. ప్రభుత్వ భవనాలను రాజకీయ సమావేశాలకు ఉపయోగించవద్దని, ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ పరమైన సమావేశాల్లో పాల్గొనవద్దని సూచించారు. సరైన పత్రాలు లేకుండా 50వేల కంటే ఎక్కువ నగదును తరలిస్తే సీజ్‌ చేయాలని ఆదేశించారు. ఆలయాలు, చర్చీలు, మసీదులు, ప్రార్థనా మందిరాలను ఎన్నికల ప్రచారానికి వినియోగించవద్దని, ప్రైవేట్‌ భవనాల యజమానుల అనుమతి లేకుండా పోస్టర్లు అంటించవద్దని కలెక్టర్‌ అన్నారు. అధికారుల అనుమతిలేకుండా పార్టీలుగానీ, అభ్యర్థిగానీ బహిరంగ సమావేశాలను నిర్వహించవద్దని, కొత్త పథకాల ప్రకటన, ప్రాజెక్టుల శంకుస్థాపన, కొత్త పనుల మంజూరు, ఆర్థిక గ్రాంట్లను ప్రకటించవద్దని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్లు ప్రఫుల్‌ దేశాయ్‌, లక్ష్మీకిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ చాహాత్‌ భాజ్‌పాయ్‌, డీఆర్వో పవన్‌కుమార్‌, ఆర్డీవో మహేశ్వర్‌ పాల్గొన్నారు.

===========================

2024, డిసెంబరు 30 వరకు

పట్టభద్రుల స్థానంలో మొత్తం ఓటర్లు: 3,41,313

పురుషులు: 2,18,060

మహిళలు: 1,23,250

ట్రాన్స్‌ జెండర్లు: 3

డిసెంబరు 31 నుంచి జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకున్న వారు: 11,056

=======================================

2024, డిసెంబరు 30 వరకు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం ఓటర్లు: 25,921

పురుషులు : 16,364

మహిళలు : 9,557

డిసెంబరు 31 నుంచి జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకున్న వారు: 2,148

Updated Date - Jan 30 , 2025 | 01:28 AM