కోడ్ కూసింది...
ABN , Publish Date - Jan 30 , 2025 | 01:30 AM
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇటీవల ప్రభుత్వం కొత్తగా ఆరంభించిన నాలుగు కొత్త పథకాల అమలుపై సందేహాలు నెలకొన్నాయి.

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేయడంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇటీవల ప్రభుత్వం కొత్తగా ఆరంభించిన నాలుగు కొత్త పథకాల అమలుపై సందేహాలు నెలకొన్నాయి. ఈ పథకాలను ఇదివరకే ఆరంభించినందున అమలుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇస్తుందా, ఇవ్వదా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పుడే ఎన్నికల షెడ్యూల్ రావడంపై ప్రధానంగా రైతు భరోసా పథకం డబ్బులు ఇప్పుడే రావనే విషయం తెలిసి షాక్‌కు గురవుతున్నారు. కోడ్ వల్ల అభివృద్ధి పనులు సైతం నిలిచి పోనున్నాయి.
ముగిసిన పదవీకాలం
కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులతో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మె ల్సీల పదవీ కాలం మార్చి 29వ తేదీతో ముగుస్తున్నది. దీంతో గడువుకు నెల రోజుల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం షెడ్యూల్ విడుదల చేశారు.
షెడ్యూల్ విడుదలైన తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పరిధి 13 జిల్లాలకు విస్తరించి ఉండడంతో ఆ జిల్లాల్లో కోడ్ అమల్లో ఉంటుంది. అందులో పెద్దపల్లి జిల్లా కూడా ఉంది. మార్చి 10వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అధికారిక కార్యక్రమాలు చేయడం గానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను మంజూరు చేయరాదు.
సంక్షేమ పథకాలకు బ్రేక్ పడేనా?
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26వ తేదీన ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలను ఆరంభించింది. ఈ పథకాలకు అర్హులైన వారి జాబితాలపై అభ్యం తరాలను స్వీకరించేందుకు 21 నుంచి 23వ తేదీ వరకు గ్రామ, వార్డు సభలను నిర్వహించారు. ఆ గ్రామాల్లో అర్హులైన వారందరికీ పథకాలను ఒకేసారి వర్తింపజేశారు. రైతు భరోసా కింద మొత్తం మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల అర్హులకు, రేషన్ కార్డులకు అర్హులైన వారందరికీ మంజూరు పత్రాలను అందజేశారు. మిగతా గ్రామా లు, పట్టణాలకు ఎన్ని ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి, లబ్ధిదారుడిని ఎంపిక చేయాలనే విషయమై కసరత్తు చేస్తున్నారు. రేషన్ కార్డుల జారీ కోసం ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా ఎప్పుడు పడుతుందా అని రైతులు, కూలీలు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఎవరు ఊహించని విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం కోడ్ అమల్లోకి రావడం వల్ల రైతు భరోసా డబ్బులు ఖాతాల్లో పడతాయా, లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. షెడ్యూల్‌కు ముందే పథకాలను అరంభించినందున లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, రేషన్ కార్డులు ఇస్తరా, ఇవ్వరా అనే స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ అనుమతిం చకపోతే మాత్రం 40 నుంచి 45 రోజుల వరకు పథకాల కోసం అర్హులైన వాళ్లు వేచిఉండాల్సిందే.