Miss World Top 10 Finalists: కీలక దశకు మిస్‌వరల్డ్ పోటీలు
ABN , Publish Date - May 22 , 2025 | 04:27 AM
మిస్ వరల్డ్ 2025 పోటీలు కీలక దశకు చేరుకున్నాయి. టాప్-24 జాబితాలో మిస్ ఇండియా నందినీ గుప్తా ఎంపికై, అందరి దృష్టి ఆమెపై ఉంది.
టాప్ 24ను ప్రకటించిన నిర్వాహకులు.. జాబితాలో మిస్ ఇండియా నందినీ గుప్తా
‘హెడ్ 2 హెడ్’ పోటీల్లో 84 మంది ఔట్.. నాలుగు ఖండాల నుంచి మిగిలిన పోటీదారులు
రేపు ఖరారు కానున్న టాప్-10 జాబితా.. అందరి దృష్టి నందిని పైనే
భారత్‌కు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా సుందరీమణుల నుంచి పోటీ
నేడు విక్టోరియా మెమోరియల్ హోంను సందర్శించనున్న బ్యూటీలు
హైదరాబాద్, మే 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఆతిథ్యమిస్తున్న మిస్ వరల్డ్-2025 పోటీలు రసవత్తరంగా మారుతున్నాయి. పోటీలో పాల్గొంటున్న మొత్తం 108 దేశాల సుందరీమణుల నుంచి టాప్-24 జాబితాను మిస్‌వరల్డ్ నిర్వాహక సంస్థ బుధవారం ప్రకటించింది. ఇందులో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న నందినీ గుప్తా సహా.. నాలుగు ఖండాల నుంచి 24 మంది అందగత్తెలు ఉన్నారు. వీరిలో యూర్‌పలోని పోలండ్, మాల్టా, ఇటలీ, ఎస్తోనియా, జర్మనీ, నెదర్లాండ్స్, వేల్స్, చెక్ రిపబ్లిక్, ఐర్లాండ్ దేశాలకు చెందిన 9 మంది ఉన్నారు. ఇక అమెరికా-కరేబియన్ ఖండం నుంచి అమెరికా, బ్రెజిల్, జమైకా, అర్జెంటినా, కేమెన్ ఐలాండ్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన ఆరుగురు ఎంపికయ్యారు. కాగా, ఆసియా-ఓసియానా ఖండం నుంచి భారత్, శ్రీలంక, ఆస్ర్టేలియా, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్ దేశాలకు చెందినవారు. ఆఫ్రికా నుంచి నైజీరియా, ఇథియోపియా, కామెరూన్, కెన్యా దేశాల సుందరీమణులు ఉన్నారు. కాగా మిస్‌వరల్డ్ పోటీదారులు ‘బ్యూటీ విత్ పర్పస్’ పేరుతో తమ సేవా కార్యక్రమాలను వివరించే ‘హెడ్ 2 హెడ్’ పోటీలు మంగళవారం ప్రారంభమై.. బుధవారం ముగిశాయి. రెండు రోజుల్లో మొత్తం 108 మంది ఈ పోటీలో పాల్గొన్న అనంతరం టాప్-24 జాబితాను ప్రకటించారు. ఈ నెల 10న ప్రారంభమైనప్పటి నుంచి బుధవారం వరకు వివిధ దశల్లో పోటీలు నిర్వహించినట్లు మిస్ వరల్డ్ నిర్వాహకులు తెలిపారు.
రేపు తేలనున్న తుది జాబితా..
ఈ నెల 23న నిర్వహించనున్న కీలకమైన పోటీలో 24 మంది అందాలభామలు తమ ప్రతిభను చాటనున్నారు. వీరిలో నుంచి టాప్-10ను ఎంపిక చేస్తారు. వారు ఈ నెల 31న హెచ్‌ఐసీసీలో జరిగే తుది పోటీల్లో పాల్గొంటారు. ఆ పోటీల్లో టాప్-10లోనుంచి ఒక్కో ఖండం నుంచి ఇద్దరు చొప్పున నాలుగు ఖండాలకు చెందిన 8 మందిని ఎంపిక చేస్తారు. చివరికి ఒక్కో ఖండం నుంచి ఒకరి చొప్పున నలుగురిని ఖరారు చేస్తారు. వీరిని మిస్ వరల్డ్ ఆసియా, మిస్ వరల్డ్ ఓసియానా, మిస్ వరల్డ్ ఆఫ్రికా, మిస్ వరల్డ్ యూరప్ విజేతలుగా ప్రకటిస్తారు. ఈ నలుగురిలో నుంచి మిస్ వరల్డ్ విజేతను ఎంపిక చేస్తారు. మిగతా ముగ్గురిని రన్నరప్ 1, 2, 3లుగా ప్రకటిస్తారు.
భారత్‌కు ఆ నలుగురితో పోటీ..
బుధవారం ప్రకటించిన టాప్-24 జాబితాలో యూరప్ నుంచి అత్యధికంగా 9 మంది ఉండగా, అమెరికా-కరేబియన్ నుంచి ఆరుగురు, ఆసియా-ఓసియానా నుంచి 5, ఆఫ్రికా నుంచి 4 దేశాల ప్రతినిధులు ఉన్నారు. ప్రతిసారీ ఉన్నట్లుగానే ఈసారి కూడా యూరప్ దేశాల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. గతేడాది మిస్ వరల్డ్ విజేతగా నిలిచిన క్రిస్టినా ఇదే ఖండం నుంచి పోటీపడి విజేతగా నిలిచారు. ఆసియా-ఓసియానా నుంచి ఈసారి భారత్‌తోపాటు మరో ఐదు దేశాలు శ్రీలంక, ఫిలిప్పీన్స్, ఇండోనేసియా, ఆస్ర్టేలియా పోటీ పడుతున్నాయి. భారత్ ప్రతినిధిగా ఉన్న నందినీ గుప్తా ఆసియా-ఓసియానా ఖండం నుంచి విజేతగా నిలవాలంటే ఈ నాలుగు దేశాలతో పోటీపడాల్సి ఉంటుంది. వీరిలో నుంచి మిస్ ఆసియా-ఓసియానాగా గెలిస్తే నందినికి మిస్ వరల్డ్ టాప్-4లో చోటు లభిస్తుంది. విజేతగా నిలిచే అవకాశాలూ పెరుగుతాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆతిథ్య దేశం ప్రతినిధిగా ఈసారి నందినీ గుప్తాపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. 1951 నుంచి ఇప్పటివరకు జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో భారత్, వెనెజులా అత్యధికంగా ఆరుసార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నాయి. ఈసారి పోటీల్లో భారత్ గెలిస్తే.. ఇంతవరకు ఏ దేశం సాధించని అరుదైన రికార్డు సొంతమవుతుంది.
నేడు ‘విక్టోరియా’ సందర్శన
ఎల్‌బీనగర్: ప్రపంచ సుందరి పోటీదారులు గురువారం సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హోంను సందర్శించనున్నారు. హోంలోని విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వరల్డ్ లైబ్రరీ (కంప్యూటర్ ల్యాబ్)ని ప్రారంభించనున్నారు. ఈ అద్భుత కట్టడాన్ని 1903లో ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ బహదూర్ నిర్మించారు.