BC Reservation: బీసీలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలకు!
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:25 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మంత్రుల కమిటీ గురువారం సమావేశమైంది.
సన్నాహాలు ప్రారంభించాలన్న సీఎం రేవంత్?.. సీఎంతో టీపీసీసీ చీఫ్, మంత్రుల కమిటీ భేటీ
హైదరాబాద్, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మంత్రుల కమిటీ గురువారం సమావేశమైంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. న్యాయనిపుణుల సలహాల అనంతరం రిజర్వేషన్లపై కమిటీ మూడు ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను సీఎంకు సూచించినట్లు తెలిసింది. బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై గాంధీభవన్‌లో బుధవారం జరిగిన న్యాయ సలహా కమిటీ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీహరి, పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. అభిషేక్ సింఘ్వీ తదితర న్యాయనిపుణులు ఇచ్చిన సలహాలు, సూచనలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై మహేశ్‌గౌడ్‌కు కమిటీ సభ్యులు మూడు ప్రత్యామ్నాయాలను సూచించినట్లు తెలిసింది. పార్టీ పరంగా ఎన్నికల్లో బీసీలకు 42 శాతం అవకాశం కల్పించడం, ప్రత్యేక జీవోతో రిజర్వేషన్లు అమలు చేయడం, మరో నెల రోజుల గడువు ఉన్నందున కేంద్రం నుంచి ఆమోదం లభించేవరకు నిరీక్షించడం.. ఈ అంశాలపై సీఎం రేవంత్‌తో చర్చించినట్లు తెలిసింది.
సెప్టెంబరు 30లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్ల అమలుకు కార్యాచరణ రూపొందించడంపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. రిజర్వేషన్లు పెంచుతూ ప్రత్యేక జీవోతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తే అడ్డుకునేందుకు విపక్షాలు కోర్టును ఆశ్రయిస్తే ఏం చేయాలనేదానిపైనా చర్చించినట్లు తెలిసింది. గతంలో బీసీలకు సంబంధించిన సమాచారం లేకపోవడంతో రిజర్వేషన్ల పెంపును కోర్టు అంగీకరించలేదని, ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణన సమాచారాన్ని అందిస్తే కోర్టు సానుకూలంగా స్పందించే అవకాశం ఉంటుందని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. మరోవైపు హైకోర్టు గడువుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపైనా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. ఏదేమైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలకు వెళ్లడానికి సన్నాహాలు ప్రారంభించాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా కమిటీకి స్పష్టం చేసినట్లు సమాచారం.