Share News

Telangana Politics: కవిత ఎపిసోడ్‌.. కుటుంబ డ్రామా: సీతక్క

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:10 AM

కవిత ఎపిసోడ్‌ కుటుంబ రాజకీయ డ్రామా అంటూ మంత్రి సీతక్క కొట్టిపారేశారు. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్‌.. నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోపెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేని బలహీన పరిస్థితికి చేరుకున్నారా అని ప్రశ్నించారు.

Telangana Politics: కవిత ఎపిసోడ్‌.. కుటుంబ డ్రామా: సీతక్క

  • అది కేసీఆర్‌ కుటుంబ పంచాయితీ: అడ్లూరి

  • కాళేశ్వరంపై కాంగ్రెస్‌ చెప్పిందే కవిత చెప్పింది: ఆది శ్రీనివాస్‌

హైదరాబాద్‌/హనుమకొండ సిటీ, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): కవిత ఎపిసోడ్‌ కుటుంబ రాజకీయ డ్రామా అంటూ మంత్రి సీతక్క కొట్టిపారేశారు. తెలంగాణ జాతిపితగా చెప్పుకునే కేసీఆర్‌.. నలుగురు కుటుంబ సభ్యులను కూర్చోపెట్టి మాట్లాడి సర్దుబాటు చేయలేని బలహీన పరిస్థితికి చేరుకున్నారా అని ప్రశ్నించారు. అవినీతి, అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన తేడా వల్లే కేసీఆర్‌ కుటుంబ సభ్యులు గొడవలు పడుతున్నారన్నారు. కేటీఆర్‌ను కవిత వెనకేసుకురావడమూ పెద్ద డ్రామా అని ఆమె విమర్శించారు. హరీశ్‌ వెనుక సీఎం రేవంత్‌ఉంటే.. కాళేశ్వరం అవినీతిపైన విచారణ కమిషన్‌ను ఎందుకు నియమిస్తారని, ఆ కేసును లోతైన విచారణ కోసం సీబీఐకి ఎందుకు అప్పగిస్తారని మంత్రి అడ్లూరి లక్ష్మణకుమార్‌ ప్రశ్నించారు. కాళేశ్వరంలో అవినీతి బయటపడ్డాక కేసీఆర్‌ కుటుంబంలో పంచాయితీ మొదలైందన్నారు. మంత్రితో ముఖాముఖీ కార్యక్రమంలో భాగంగా బుధవారం గాంధీభవన్‌లో ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌ నాయకుడని, ఆయన వెనకుండి ఎవరినీ నడిపించరని.. ఆయన వెనకే అందరూ ఉంటారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. కాళేశ్వరం అవినీతి సొమ్ముతో హరీశ్‌రావు, సంతో్‌షరావు బంగారం కొన్నట్లుగా కవిత చెబుతోందని, ఆ బంగారం ఎక్కడుందో చెబితే సీఎం రేవంత్‌కి చెప్పి విచారణ చేయిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హన్మంతరావు అన్నారు. రాష్ట్రాన్ని దొంగల్లా దోచుకుతిన్న కేసీఆర్‌ కుటుంబాన్ని, బీఆర్‌ఎస్‌ నేతలను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హనుమకొండ అన్నారు.


బీజేపీ-బీఆర్‌ఎస్‌ దోస్తీ కోసమే కవిత సస్పెన్షన్‌: విజయశాంతి

‘‘కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ మొదలైతే బీజేపీని మేనేజ్‌ చేసుకోవడం బీఆర్‌ఎ్‌సకు చాలా అవసరం. రెండు పార్టీల మధ్య భవిష్యత్తులో జరగబోయే రహస్య ఒప్పందాలకు అడ్డనే కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు’’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 04:10 AM