Share News

Adluri Warns Ponnam to Change Tone: మాటల మంటలు

ABN , Publish Date - Oct 08 , 2025 | 04:59 AM

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యల వివాదం.. చినికి చినికి గాలివానగా మారుతోంది...

Adluri Warns Ponnam to Change Tone: మాటల మంటలు

  • మంత్రి పొన్నం వ్యాఖ్యలతో వివాదం

  • తీవ్రంగా స్పందించిన మంత్రి అడ్లూరి

  • తీరు మార్చుకోవాలని పొన్నం ప్రభాకర్‌కు హెచ్చరిక

  • సోనియా, రాహుల్‌, ఖర్గేకు ఫిర్యాదు చేస్తానన్న అడ్లూరి లక్ష్మణ్‌

  • దళిత సంఘాల ఫైర్‌.. పొన్నం వ్యాఖ్యలను తప్పుబట్టిన శ్రీధర్‌బాబు

  • తాను అడ్లూరిని ఉద్దేశించి మాట్లాడలేదని మరోసారి పొన్నం వివరణ

  • ఇద్దరు మంత్రులకు పీసీసీ చీఫ్‌ ఫోన్‌.. నేడు వారితో సమావేశం!

హైదరాబాద్‌/కరీంనగర్‌, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేసిన వ్యాఖ్యల వివాదం.. చినికి చినికి గాలివానగా మారుతోంది. పొన్నం వ్యాఖ్యల పట్ల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తీవ్రంగా స్పందిస్తూ మంగళవారం వీడియో విడుదల చేశారు. ఇందులో పొన్నంతోపాటు మరో మంత్రి వివేక్‌ వెంకటస్వామి తీరునూ తప్పుబట్టారు. మరోవైపు పొన్నం ప్రభాకర్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో పలుచోట్ల దళిత సంఘాల నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో అప్రమత్తమైన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. ఇటు పొన్నం ప్రభాకర్‌కు, అటు అడ్లూరి లక్ష్మణ్‌కు ఫోన్‌ చేసి వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేశారు. తిరిగి బుధవారం ఈ ఇద్దరు మంత్రులతో తన నివాసంలో సమావేశం కానున్నారు. ఆదివారం (ఈ నెల 5న) జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌ సందర్భంగా.. పొన్నం చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. ఆయనతోపాటు మంత్రులు వివేక్‌ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పాల్గొన్న ఈ ప్రెస్‌మీట్‌ సందర్భంగా పొన్నం ప్రభాకర్‌ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు మంత్రి అడ్లూరిని.. బాడీ షేమింగ్‌ చేసేలా ఉన్నాయంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ అదే రోజు స్పందించారు. తాను చేసిన ఆ వ్యాఖ్యలు తన సిబ్బందిని ఉద్దేశించినవని, మంత్రినుద్దేశించి చేసినవి కాదని అన్నారు.

పొన్నం, వివేక్‌లపై ఆగ్రహం

పొన్నం వివరణతో సమసిపోయిందనుకున్న వివాదం అనూహ్యంగా మంగళవారం మళ్లీ రాజుకుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అడ్లూరి లక్ష్మణ్‌ వీడియో విడుదల చేశారు. పొన్నం ప్రభాకర్‌ తన తప్పు తెలుసుకుంటారని భావించానని, ఆయన మారకపోతే జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. పొన్నం ప్రభాకర్‌ మాదిరిగా తనకు అహంకారంగా మాట్లాడటం రాదన్నారు. మాదిగ సామాజికవర్గంలో పుట్టడమే తన తప్పా? అని ప్రశ్నించారు. తాను కాంగ్రెస్‌ జెండాను నమ్ముకున్నవాడినని, మాదిగను కాబట్టే మంత్రి పదవి వచ్చిందని తెలిపారు. త్వరలోనే సోనియా, రాహుల్‌, మల్లికార్జున ఖర్గేను కలిసి తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తానన్నారు. పొన్నం ప్రభాకర్‌ అలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే.. అక్కడే ఉన్న వివేక్‌ సహచర మంత్రిగా కనీసం ఖండించలేదని తప్పుబట్టారు. తాను పక్కన ఉంటే వివేక్‌ ఓర్వడంలేదన్నారు. ప్రెస్‌మీట్‌లో తాను పక్కన కూర్చుంటే వివేక్‌ లేచి వెళ్లిపోవడం ఏంటని ప్రశ్నించారు. మరోవైపు మంత్రి శ్రీధర్‌బాబు సైతం పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వనికి మంచిది కాదన్నారు.


రంగంలోకి పీసీసీ చీఫ్‌..

వివాదం తీవ్రరూపం దాలుస్తుండడంతో అప్రమత్తమైన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌.. ఇద్దరు మంత్రులకు ఫోన్‌ చేసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇద్దరూ సమన్వయంతో కలిసిమెలిసి పని చేసుకోవాలని సూచించారు. మరోవైపు ఇదే అంశంపై కాంగ్రె్‌సకు చెందిన ఎస్సీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామేలు, లక్ష్మీకాంత్‌, కాలె యాదయ్య మంగళవారం పీసీసీ చీఫ్‌ మహేశ్‌గౌడ్‌ను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కలిశారు. అయితే ఈ అంశంపై తాను ఇప్పటికే పొన్నం, అడ్లూరితో చర్చించానని, సమస్య సద్దు మణిగిందని వారితో మహేశ్‌గౌడ్‌ చెప్పారు. ఇదిలా ఉండగా.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై స్పందించబోనని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ప్రెస్‌మీట్‌ సందర్భంగా ఏం జరిగిందన్నది పీసీసీ అధ్యక్షుడికి వివరించానని, పార్టీపరంగా ఆయన ఆదేశాలు శిరసావహిస్తానని తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యలు అడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశించినవి కావని మరోమారు స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా వక్రీకరించి ప్రచారం చేసిందని, ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని అన్నారు.

మాదిగ సామాజికవర్గం నిరసనలు..

మాదిగ సామాజికవర్గానికి చెందిన పలువురు అడ్లూరికి మద్దతుగా పలు చోట్ల మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి వైఖరిని నిరసించారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో, చిగురుమామిడి మండల కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. కాగా, అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల వద్ద మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అహంపూరిత వ్యాఖ్యల వల్ల దళితులు, బలహీనవర్గాల మధ్య దూరం పెరుగుతుందని, పొన్నం ప్రభాకర్‌ ఈ విషయాన్ని అర్థం చేసుకొని తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు. కాకా వెంకటస్వామి జయంతి వేడుకలకు అన్ని వర్గాల వారిని ఆహ్వానించిన మంత్రి వివేక్‌.. అడ్లూరి లక్ష్మణ్‌ను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. కాగా, మంత్రి పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యలను మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఆరెపల్లి రాజేందర్‌, గౌరవ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కాశీం తీవ్రంగా ఖండించారు. పొన్నం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై పొన్నం ప్రభాకర్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్‌.కుమార్‌ తెలిపారు.

Updated Date - Oct 08 , 2025 | 04:59 AM