Minister Uttam Kumar: తుమ్మిడిహెట్టిపై ప్రతిపాదనలు సిద్ధం చేయండి
ABN , Publish Date - May 21 , 2025 | 05:31 AM
తుమ్మిడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా టన్నెల్ తవ్వకాలు, మరమ్మతులు చేపట్టాలని మరియు పెండింగ్ బిల్లులు చెల్లించాలని సూచించారు,
148 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి చర్యలు
ఎస్‌ఎల్‌బీసీ తవ్వకం చేపట్టాలి: ఉత్తమ్
హైదరాబాద్, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకంలో భాగంగా 148 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. పలు ప్రాజెక్టులపై ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌పైనా మంత్రి సమీక్షించారు. ఇన్‌లెట్(దోమలపెంట-శ్రీశైలం) వైపు నుంచి వెంటనే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ (డీబీఎం) విధానంలో తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. ఔట్‌లెట్ (మన్నెవారిపల్లి-అచ్చంపేట) వైపు టన్నెల్ బోరింగ్ మిషన్(టీబీఎం)కు బేరింగ్‌ను సత్వరం అమర్చి టన్నెలింగ్ చేయాలన్నారు. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) నివేదిక ప్రకారం పరీక్షలు, ఇతర మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బిల్లులు విడుదల చేయాలని నిర్మాణ సంస్థలు కోరుతున్నాయని అధికారులు నివేదించగా పెండింగ్ బిల్లులు ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. సమ్మక్కసాగర్ బ్యారేజీకి ఛత్తీ్‌సగఢ్ నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకోవడానికి వీలుగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జలాశయాల్లో పూడికతీత కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. నల్లగొండ జిల్లాలోని ధర్మారెడ్డి కాలువ, పిళ్లాయిపల్లి కాలువ, బునియాదిగాని కాలువ పనులను సత్వరం చేపట్టాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. సమీక్షలో గుత్తా కూడా పాల్గొన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని, ఉత్తమ్ నిరంతరం అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని గుత్తా గుర్తు చేశారు.