డైట్, ఎస్‌సీఈఆర్టీలు విద్యాభివృద్ధికి కృషి చేయాలి
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:24 AM
జిల్లా విద్యా, శిక్షణ సంస్థలు (డైట్), రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండళ్లు(ఎ్‌ససీఈఆర్టీ) విద్యాభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి పేర్కొన్నారు.
కొత్త సాంకేతికతను ఉపాధ్యాయులు తరగతి గదిలో వాడేలా చూడాలి
కేంద్ర మంత్రి జయంత్ చౌదరి
హైదరాబాద్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): జిల్లా విద్యా, శిక్షణ సంస్థలు (డైట్), రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండళ్లు(ఎ్‌ససీఈఆర్టీ) విద్యాభివృద్ధికి కృషి చేయాలని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి పేర్కొన్నారు. ఆదివారం ఎస్‌సీఈఆర్టీ కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డైట్‌లు, ఎస్‌సీఈఆర్‌టీలు నిర్వహించే పరిశోధనలు, అధ్యయనాలను క్షేత్ర స్థాయిలో తప్పనిసరిగా అమలు చేసేలా అధికారులు చూడాలన్నారు. దీర్ఘ, స్వల్పకాల లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు తగు వ్యూహాలను అమలు చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఐటీ కేంద్రంగా గుర్తింపు పొందిందన్నారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ నూతన సాంకేతికతను తరగతి గదిలో వాడేలా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. పాఠశాల విద్య డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. వేసవిలో ఉపాధ్యాయులందరికీ శిక్షణ ఇచ్చామని, విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు ఇవ్వడమేకాకుండా తరగతి గదుల్లో ఏఐ ఆధారిత బోధనను అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఎస్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సందర్శించారు. ఇందులో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు, పీఎం శ్రీ, కేజీబీవీ పాఠశాలలు, విద్యార్థుల బోధన సాధనాలు, బడిబాట, సమ్మర్ క్యాంపులు వంటి కార్యక్రమాల చిత్రాలను ఆయన పరిశీలించారు.