Minister Tummala: టోకెన్లు ఇచ్చి పంపిణీ చేయండి
ABN , Publish Date - Aug 19 , 2025 | 03:57 AM
యూరియా సరఫరాలో గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు రైతులకు టోకెన్లు జారీ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు..
హైదరాబాద్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): యూరియా సరఫరాలో గందరగోళం తలెత్తకుండా ఉండేందుకు రైతులకు టోకెన్లు జారీ చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఒకేరోజు రైతులంతా బారులు తీరే పరిస్థితి రాకుండా.. ఏ రోజు ఎవరు రావాలో సూచిస్తూ టోకెన్లు జారీచేయాలన్నారు. తొలుత చిన్న, సన్నకారు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాత విడతల వారీగా పెద్ద రైతులకు యూరియా పంపిణీ చేయాలని సూచించారు. అవసరమైతే పట్టాదారు పాస్ పుస్తకాలను అనుసంధానం చేయాలని, రైతులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి రాష్ట్రానికి సరిపడా యూరియా రాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు. 3 లక్షల టన్నుల యూరియా లోటు ఏర్పడిందని, దీనిని గ్రహించి కలెక్టర్లు యూరియా సరఫరాను పకడ్బందీగా పర్యవేక్షించాలని సూచించారు. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు మళ్లించకుండా అన్ని శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశ్రామిక అవసరాలకు సబ్సిడీ యూరియాను మళ్లించే అవకాశమున్న యూనిట్లను తనిఖీ చేసి, వ్యత్యాసాలుంటే కేసులు నమోదు చేయాలన్నారు. రైతులకు ప్రభుత్వం సమయానికి సరఫరా చేస్తున్నదనే నమ్మకం కల్పించాలన్నారు. రైతులు.. ప్రతిపక్ష పార్టీల నాయకులు మాట్లాడే మాటలకు భయాందోళనకు గురై యూరియాను అవసరానికి మించి కొనుగోలు చేయవద్దని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.