Share News

Health Minister: చికిత్స మధ్యలో డిశ్చార్జి చేసే ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులపై కఠిన చర్యలు

ABN , Publish Date - Aug 30 , 2025 | 02:24 AM

చికిత్స మధ్యలో రోగులను డిశ్చార్జి చేస్తున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శాఖ అధికారులను ఆదేశించారు.

Health Minister: చికిత్స మధ్యలో డిశ్చార్జి చేసే ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రులపై కఠిన చర్యలు

  • అధికారులకు వైద్య మంత్రి దామోదర ఆదేశాలు

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): చికిత్స మధ్యలో రోగులను డిశ్చార్జి చేస్తున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శాఖ అధికారులను ఆదేశించారు. అత్యవసర చికిత్స కోసం నేరుగా నిమ్స్‌కు వచ్చే రోగులను, ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి రిఫరల్‌పై వచ్చే వారికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నిమ్స్‌లో రోగులకు అందుతున్న వైద్య సేవలపై హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కార్యాలయంలో నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి దామోదర సమీక్ష సమావేశం నిర్వహించారు. నిమ్స్‌లో ఈ ఏడాది తొలి ఏడు నెల్లలో (జనవరి నుంచి జూలై) 5 లక్షల 44 వేల మందికి వైద్య ేసవలు అందించామని బీరప్ప తెలిపారు. ఇందులో సగానికిపైగా ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్‌ వంటి ప్రభుత్వ పథకాల కింద ఉచితంగా చికిత్స పొందారని వివరించారు. ఈ ఏడాది ఇప్పటికే వందకుపైగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీలు కూడా చేశామని వెల్లడించారు.


ప్రస్తుతం నిమ్స్‌ ఎమర్జెన్సీ వార్డుకు రోజుకు 80 నుంచి వంద మంది రోగులు వస్తున్నారని తెలిపారు. ఇందులో సగం మందికిపైగా రోగులు ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొంది, పరిస్థితి విషమించాక చివరి నిమిషంలో నిమ్స్‌కు వస్తున్నారని వెల్లడించారు. కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేసిన తర్వాత రోగులు పూర్తిగా కోలుకోకముందే వారిని డిశ్చార్జి చేసి, నిమ్స్‌, ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులకు పంపిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యసేవలందిస్తున్న నిమ్స్‌ డైరెక్టర్‌, డాక్టర్లు, సిబ్బందిని మంత్రి అభినందించారు. చికిత్స మధ్యలో రోగులను పంపే ప్రైవేటు ఆస్పత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - Aug 30 , 2025 | 02:24 AM