Telangana Agriculture: రైతులకు 40 వేల కోట్లు చెల్లించాం
ABN , Publish Date - Feb 08 , 2025 | 03:28 AM
వ్యవసాయరంగంలో వస్తున్న ఆధునిక యంత్రాలను రైతులకు సబ్సిడీతో అందించడంతో పాటు హార్టికల్చర్ రైతులను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

సబ్సిడీతో వ్యవసాయ యంత్రాలిచ్చేందుకు చర్యలు
హార్టికల్చర్ రైతులకు తగిన ప్రోత్సాహం
మాదాపూర్ హైటెక్స్‌లో ‘కిసాన్ అగ్రి షో’ ప్రారంభంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ యాంత్రీకరణ, సన్నధాన్యానికి బోనస్, రుణమాఫీ, రైతు భరోసా తదితర పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు నేరుగా రూ.40 వేల కోట్లు చెల్లించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వ్యవసాయరంగంలో వస్తున్న ఆధునిక యంత్రాలను రైతులకు సబ్సిడీతో అందించడంతో పాటు హార్టికల్చర్ రైతులను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మాదాపూర్ హైటెక్స్‌లో మూడు రోజుల ‘కిసాన్ అగ్రి షో-2025’(వ్యవసాయ పనిముట్లు, ఉత్పత్తుల ప్రదర్శన)ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని జిల్లా కేంద్రాల్లో వ్యవసాయ సీజన్ ఆరంభంలో అగ్రి షోలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాల్లో నిర్వహించే అగ్రి షోలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లు, రోబోల వినియోగాన్ని పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు. ఉత్పాదకతను పెంచేందుకు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక త, ఆవిష్కరణలు ఆవరసరమన్నారు. మండల స్థాయి వ్యవసాయ అధికారులకు ఆయా మండలాల్లో పండించే అన్ని పంటలపై పూర్తిస్థాయి అవగాహన ఉండాలని తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కిసాన్ ఫోరం ప్రైవేట్ లిమిటెడ్ కన్వీనర్ నిరంజన్ దేశ్‌పాండే మాట్లాడుతూ.. అగ్రి షోలో 140 మందికి పైగా ప్రదర్శకులు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ రఘునందన్‌రావు, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి పాల్గొన్నారు. కాగా, అగ్రి షో ప్రదర్శనలో ‘ఫార్మ్ రోబో’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రిమోట్‌తో నడిచే, రూ.4.5 లక్షల ధర కలిగిన ఈ వ్యవసాయ రోబో(చిన్న పాటి ట్రాక్టర్ తరహా)తో గొర్రు కొట్టడంతో పాటు హ్యాండ్ గన్, స్వీప్ స్ర్పేయర్లతో పురుగుమందులు చల్లవచ్చు. జీపీఎస్ నావిగేషన్‌తో మ్యాపింగ్ ఇస్తే 700 మీటర్ల పరిధి వరకు వ్యవసాయ పనులకు ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు పురుగుల మందు చల్లే డ్రోన్లు, వరి నాటు మిషన్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి.