Adluri Lakshman kumar: మంత్రి అడ్లూరికి తప్పిన పెను ప్రమాదం
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:26 AM
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు శనివారం జగిత్యాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.
మంత్రి కారును ఢీకొన్న మరో వాహనం
మెట్‌పల్లి రూరల్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు శనివారం జగిత్యాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి ప్రయాణిస్తున్న కారును మెట్‌పల్లి మండలం మారుతీనగర్ గ్రామ శివారులో స్ర్కాప్ కారును తరలిస్తున్న టోయింగ్ వాహనం ఢీకొట్టడంతో కారు టైర్ ఊడిపోయింది. వెంటనే మంత్రి అడ్లూరి కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి వాహనాన్ని అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంత్రి మెట్‌పల్లిలో తన పర్యటనను ముగించుకొని ధర్మపురికి ల్యాండ్ క్రూజర్ వాహనంలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కమ్మరిపల్లికి చెందిన వ్యక్తి కోరుట్లలో కొనుగోలు చేసిన స్ర్కాప్ వాహనాన్ని టోయింగ్ వాహనం సహాయంతో మెట్‌పల్లికి తరలిస్తుండగా మారుతీనగర్ గ్రామ శివారులో మంత్రి కారును ఎదురుగా ఢీకొట్టింది. దీంతో మంత్రి ప్రయాణిస్తున్న కారు ముందు టైరు ఊడిపోయింది. మంత్రి వేరే కారులో ధర్మపురికి బయలుదేరి వెళ్లిపోయారు. సంవత్సరం క్రితం విప్ హోదాలో ఉన్నప్పుడు జరిగిన కారు ప్రమాదంలోనూ స్వల్ప గాయాలతో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బయటపడ్డారు.