జన జీవన స్రవంతిలో కలవండి
ABN , Publish Date - Feb 05 , 2025 | 11:31 PM
మావోయిస్టులు అజ్ఞాతం వీడి జన జీవన స్రవంతిలో కలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలోని జాడి భాగ్య అలియాస్ పుష్ప తల్లి మల్లమ్మ, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
-లొంగిపోతే ప్రభుత్వం నుంచి అన్ని ప్రయోజనాలు అందేలా చూస్తాం
-రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్
బెల్లంపల్లి, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి) : మావోయిస్టులు అజ్ఞాతం వీడి జన జీవన స్రవంతిలో కలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలోని జాడి భాగ్య అలియాస్ పుష్ప తల్లి మల్లమ్మ, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రస్తుత స్థితి గతులు, ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు నిత్యవసర సరుకులు, దుప్పట్లు అందజేశారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఏర్పడితే వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వనం వీడి జనంలోకి మావో యిస్టులు రావాలని, లొంగిపోతే ప్రభుత్వం నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రస్తుత రోజుల్లో మావోయిస్టులకు ప్రజాదరణ తగ్గిందని , అనారోగ్య సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ఇటీవల కాలంలో అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదురుకాల్పుల్లో హతమయ్యారని తెలిపారు. జన జీవన స్రవంతిలో కలిస్తే వారిపై ఉన్న రివార్డుతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామన్నారు. జాడి పుష్ప, వెంకటి దంపతులు 1999లో అజ్ఞాతంలోకి వెళ్లారని వారు లొంగిపోతే ప్రభుత్వం నఉంచి అన్ని ఏర్పాట్లు చేస్తామని తల్లి మల్లమ్మ, అన్న ఆవుల గంగారాంలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ , బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలొద్దీన్, తాళ్లగురిజాల ఎస్‌ఐ రమేష్, పోలీసులు పాల్గొన్నారు.
-కడసారి చూసేందుకైనా ఇంటికి రండి
బతుకంతా అడవుల్లోనే ఎంతకాలం తిరుగుతారు... తాము ముసలోళ్లం అయ్యాము ఇంకా ఎంత కాలం బతుకుతామో తెలియదు. కడసారి చూసేందుకైనా ఇంటికి రావాలని మావోయిస్టు జాడి భాగ్య అలియాస్ పుష్ప తల్లి మల్లమ్మ విలేకరులతో వేడుకున్నారు. అనారోగ్యంతో చివరి దశలో ఉన్నానని తనకు అండగా ఉండేందుకు అడవిని వీడి ఇంటికి రావాలని కోరింది.