Meenakshi Natarajan: పార్టీలో సీనియర్లు ఎవరు?
ABN , Publish Date - Mar 06 , 2025 | 06:27 AM
ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నాయకుల జాబితాలను క్యాటగిరీల వారీగా తెప్పించుకుంటున్నారు. మొత్తం మూడు క్యాటగిరీలుగా విభజించి జాబితాలను సిద్ధం చేయిస్తున్నారు. ఇందులో..
మధ్యలో వచ్చిన వారెవరు? వెళ్లి మళ్లీ వచ్చిందెవరు? .. నియోజకవర్గాల వారీగా మీనాక్షి ఆరా
క్యాటగిరీల వారీగా జాబితాలు కావాలని ఆదేశం
వీటి ఆధారంగా పదవుల్లో నియామకం
సమీక్షల తర్వాత క్షేత్రస్థాయి పర్యటన
సొంత నివేదికలు ఇచ్చే బదులు పార్టీకి సమయం ఇవ్వండి
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్యలు: మీనాక్షి
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్.. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు నడుం కట్టారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయి నాయకుల జాబితాలను క్యాటగిరీల వారీగా తెప్పించుకుంటున్నారు. మొత్తం మూడు క్యాటగిరీలుగా విభజించి జాబితాలను సిద్ధం చేయిస్తున్నారు. ఇందులో.. పదేళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్న నేతలను ఒక కేటగిరీ కింద, 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్దికాలం ముందు ఇతర పార్టీల నుంచి కాంగ్రె్‌సలో చేరిన నేతలను మరో కేటగిరీ కింద చేరుస్తున్నారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రె్‌సని వీడి.. పార్టీ అధికారంలోకి వచ్చాక తిరిగి కాంగ్రె్‌సలో చేరిన వారిని మరో క్యాటగిరీగా నమోదు చేయిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో మొదటి నుంచీ కాంగ్రె్‌సలో ఉన్నవారికి, ఇతర పార్టీల నుంచి కాంగ్రె్‌సలోకి వచ్చిన వారికి మధ్య వివాదాలు నెలకొని ఉన్నాయి. మొదటి నుంచీ పార్టీనే నమ్ముకున్న తమకు.. పార్టీ అధికారంలోకి వచ్చినా న్యాయం జరగడంలేదని లోక్‌సభ నియోజకవర్గాల వారీ సమీక్షల్లో అనేక మంది నాయకులు మీనాక్షికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారీగా నాయకుల జాబితాలను వివిధ క్యాటగిరీల వారీగా ఆమె తెప్పించుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ నియోజకవర్గాల వారీ సమీక్షలు పూర్తి కాగానే ఆమె క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. నామినేటెడ్ పదవులు, పార్టీ పదవుల విషయంలోనూ ఈ క్యాటగిరీల ఆధారంగానే ప్రాధాన్యం ఉంటుందని అంటున్నారు.
‘పని చేసేదెవరో.. నటించేదెవరో తెలుసు’
క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పని చేస్తున్న నేతలెవరో, నటిస్తున్న వారెవరో తనకు అంతా తెలుసునని కాంగ్రెస్ నేతలతో మీనాక్షి నటరాజన్ అన్నారు. నేతలెవరూ తమ పనితీరుపై నివేదికలు తెచ్చి తనకు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ కోసం సమయం ఇచ్చి పనిచేయాలని సూచించారు. పార్టీలో నేతల పనితీరు నచ్చకపోతే టీపీసీసీ దృష్టికిగానీ, తన దృష్టికిగానీ తీసుకురావచ్చునని అన్నారు. పార్టీ అంతర్గత విషయాలపై బయట చర్చ చేస్తే వేటు తప్పదని మరోమారు స్పష్టం చేశారు. తన పనితీరు నచ్చకపోయినా తనపై సోనియాగాంధీకి, రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు. గాంధీభవన్‌లో పార్టీ అనుబంధ సంఘాలు, ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో మీనాక్షి వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాల్లో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, ఆయా లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ మూడు సమావేశాల్లోనూ పార్టీ నేతలు క్రమశిక్షణ దాటొద్దంటూ మీనాక్షి హెచ్చరించారు. పార్టీ కోసం చిత్తశుద్ధి, క్రమశిక్షణతో కష్టపడ్డ వారికి పదవులు వస్తాయని స్పష్టం చేశారు.
విమర్శలను తిప్పికొట్టడం లేదెందుకు?: మహేశ్ గౌడ్
ఏడాది కాలంగా కార్పొరేషన్ పదవులు తీసుకున్నవారు అంత బాధ్యతగా పనిచేయడం లేదని అనుబంధ సంఘాలతో జరిగిన సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే, అప్రతిష్ఠపాలు చేస్తుంటే వెంటనే ఎందుకు స్పందిచడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వెనుకబడి పోతున్నామన్నారు. వాటిపై గ్రామాల్లో ప్రచారం చేయాలని సూచించారు. కాగా, డీసీసీ అధ్యక్షుల నియామకాన్ని సెలక్ట్ అండ్ ఎలక్ట్ పద్ధతిలో చేపట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అయితే తుది నిర్ణయం మాత్రం అధిస్ఠానానిదేనని మహేశ్‌గౌడ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి దొమ్మాటి సాంబయ్యకు కేటాయించాలని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి తదితరులు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను కోరారు.