Raghunandan Rao: దొంగ ఓట్లపై సీఈవోకు రఘునందన్ ఫిర్యాదు
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:43 AM
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో 700కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని ఎంపీ రఘునందన్‌రావు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డికి బుధవారం ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఐలాపూర్ గ్రామంలో 700కు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని ఎంపీ రఘునందన్‌రావు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డికి బుధవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటరు జాబితాలో పొరపాట్లు జరిగాయని గత పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా విడుదలకు ముందు, విడుదల తర్వాత ఎన్నికల అధికారికి, కలెక్టర్‌కు, తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఇదే విషయంపై అప్పటి సీఈవో వికా్‌సరాజ్‌కు 2024 ఏప్రిల్ 15న ఫిర్యాదు చేశామన్నారు. 950 ఓట్లు ఉండాల్సిన ఒక చిన్న పల్లెటూరులో 1650కి ఓట్లు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు. ఐలాపూర్‌లో శ్మశానవాటికకు, బోర్లు, ట్యాంక్‌లకు కూడా ఇంటి నంబర్లు ఇచ్చి సుమారు 700 ఓట్లు అదనంగా కలిపేశారని ఆరోపించారు.