Share News

వెబ్‌సైట్‌లో పేరు లేకుంటే డాక్టర్‌ కాలేరు

ABN , Publish Date - Jun 02 , 2025 | 05:51 AM

ఎంబీబీఎస్‌ 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు పొందిన విద్యార్థులు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు ఉన్నాయో, లేదో వెంటనే తనిఖీ చేసుకోవాలని ఎన్‌ఎంసీ కోరింది.

వెబ్‌సైట్‌లో పేరు లేకుంటే డాక్టర్‌ కాలేరు

  • పేర్లను చెక్‌ చేసుకోండి

  • 2024-25 వైద్య విద్యార్థులకు ఎన్‌ఎంసీ సూచన

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌ 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు పొందిన విద్యార్థులు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసీ) విడుదల చేసిన జాబితాలో తమ పేర్లు ఉన్నాయో, లేదో వెంటనే తనిఖీ చేసుకోవాలని ఎన్‌ఎంసీ కోరింది. ఈ మేరకు ఆదివారం తన అధికారిక వెబ్‌సైట్‌లో కొన్ని సూచనలు, మార్గదర్శకాలు జారీ చేసింది. వెబ్‌సైట్‌లో పేర్లు ఉన్నవాళ్లు మాత్రమే కోర్సు ముగిసిన తర్వాత మెడికల్‌ ప్రాక్టీస్‌ చేసుకునేందుకు అర్హత ఉంటుందని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది.


గతేడాది వివిధ సాంకేతిక కారణాల వల్ల విద్యార్థులు కళాశాలల్లో చేరే తుది గడువును ఎన్‌ఎంసీ మూడు సార్లు పెంచింది. దీంతో కొన్ని కాలేజీలు విద్యార్థుల అడ్మిషన్ల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరచలేదని, మరికొన్ని కాలేజీలు అసంపూర్తిగా నమోదు చేశాయని ఎన్‌ఎంసీ తెలిపింది. వెబ్‌సైట్‌లో వివరాలు లేని వారు తక్షణమే తమ రాష్ట్ర వైద్య విద్య సంచాలకుడిని సంప్రదించాలని సూచించింది.

Updated Date - Jun 02 , 2025 | 05:51 AM